ఇష్టపడి, కష్టపడి చదవండి
మంచి పేరు తీసుకు రండి చిన్నారులకు సీఎం హితబోధ
తిరుపతి, జూలై 9 (జనంసాక్షి):
నచ్చిన.. ఇష్టమైన.. చదువునే చదువుకోండి.. ఎదగండి.. అంటూ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోదించారు. ఇష్టపడి.. కష్టపడి.. చదివితే విజయం తప్పక వరిస్తుంది. విద్యా పక్షోత్సవాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని పాఠశాలలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగసభలో ఆయన ప్రసంగిం చారు. తల్లిదండ్రులు..సోదరులు.. ఉపాధ్యాయులు.. ఇరుగు పొరుగు వారు చెప్పారనో ఇష్టంలేని కోర్సులు చదవకండి. ఇష్టమైనవి..మనస్సుకు నచ్చినవే చదవండి. దానివల్ల విలువైన విద్యా సంవత్సరం సద్వినియోగం అవుతుందన్నారు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని నిరంతరం జ్ఞాపకం ఉంచుకోండి. ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ఆ దిశగా చదువు బాటలో ముందుకు సాగండి. ఇంజనీరింగ్, డాక్టర్, లాయర్.. ఇలా ఏ కోర్సు నచ్చితే ఆ కోర్సునే అభ్యసించండి. ఒకసారి మార్కులు తక్కువ వచ్చినా బాధపడకండి. నిరుత్సాహానికి గురి కాకండి. రాబోయే పరీక్షలకు శ్రద్ధగా చదువుకోండి. మనస్తాపానికి గురి కాకండి. వాటిని పట్టించుకోకండి. మీ బాటలో మీరు ముందడుగు వేయండి. విజయం తప్పకుండా చేకూరుతుంది. పాఠాలను అర్ధం చేసుకుని చదవండి. అర్ధం కాకపోతే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. అంతేగాని బట్టీయం పట్టకండి. దానివల్ల ప్రయోజనం చేకూరకపోగా.. భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుంది. అలాగే క్రీడలపై దృష్టి పెట్టండి. ఇక నుంచి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్సు పిరియడ్ గంటపాటు ఉండేలా చర్యలు తీసుకుంటాను. త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. కంప్యూటర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతోంది. ప్రతి పాఠశాలలోను కంప్యూటర్ విద్యను బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఉపాధ్యాయులు ఉన్నారు. వారి సేవలను వినియోగించుకోండి. ఏవేవో ఆశలు చూపే ప్రైవేటు పాఠశాలల జోలికి వెళ్లకండి. మన కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చదువుకోండి. మనకున్న బడ్జెట్‌లోనే చదువుకోండి. తల్లిదండ్రు లను గొంతెమ్మ కోర్కెలను కోరకండి.వారికి సహకరించండి అంటూ ముఖ్యమంత్రి విద్యార్థులకు సూచించారు. కుటుంబ పరిస్థితులను రుద్దకండిపిల్లలను వారికి ఇష్టమైన చదువును చదువుకోనీయండి. అది చదువు.. ఇది చదువు.. అంటూ వారిని వేధించకండి. ఒకవేళ అలా నడుచుకుంటే ఆ తరువాత బాధపడతారని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి తమరేనని ముఖ్యమంత్రి అన్నారు. పిల్లలను ఆవుల కాడికో.. గేదెల కాడికో.. పంపీయకండి. వారిని ఎంతో కొంత చదువుకోనీయండి. పిల్లలను చదువుకోనీయకుంటే చట్టరీత్యా నేరమవుతుందని హెచ్చరించారు. తోటివారితో కలిసిమెలిసి ఉండాలని, పెద్దలను, గురువులను గౌరవించాలని పిల్లలకు నేర్పండి. కష్టాలు, సుఖాలు చీకటి వెలుగుల్లాంటివని గుర్తించండి. ఆర్థిక స్తోమత లేదని వెనుకడుగు వేయకండి. ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిల్లలకు నేర్పండి. అంతేగాని డబ్బు సంపాదనపై దృష్టి పెట్టాలని ఒత్తిడి తేకండి. చట్టరీత్యా, గౌరవప్రదమైన సంపాదనే మేలు అని పిల్లలకు తెలియజెప్పండి. ఆ దిశగా వారు నడిచేటట్టు చూడండి. దీంతో వారు ఉత్తమ పౌరులుగా సమాజంలో రాణిస్తారన్నారు. మంత్రి గల్లా అరుణ, ఎంపి చింతామోహన్, ఎమ్మెల్యేలు, నాయకులు కోరినవన్నీ పరిష్కరిస్తాను. ఇదీ.. అదీ అని చెప్పను. ఒక్కో మండలంలో స్టేడియం నిర్మించేందుకు నిధులు ఇస్తా. అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గల్లా అరుణ, శైలజానాధ్, కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వసతి సౌకర్యాల కల్పనకు పెద్ద పీట
రూ.2,348 కోట్ల రూపాయలతో విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2,348 కోట్ల రూపాయలతో విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 5,016కోట్లతో 9,747 అదనపు తరగతి గదులు, 704 కోట్ల రూపాయలతో 12 పాఠశాలలు, 13వందల తరగతుల గదులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. 3,470 కోట్ల రూపాయలతో 5,758 మరుగు దొడ్లు ప్రారంభం.. 156 కోట్ల రూపాయలతో 500 హైస్కూలు కాంప్లెక్సులు, 10కోట్ల వ్యయంతో 108 ఎడ్యుకేషన్ కేంద్రాలు ప్రారంభం.. 10.08 కోట్లతో పట్టణ ప్రాంతాల్లో అనాథ పిల్లల కోసం 27 హాస్టళ్ల భవనాల నిర్మాణం.. 57.50 కోట్ల రూపాయలతో 46 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు.. 30.30 కోట్ల రూపాయలతో 95 ప్రహారీగోడల నిర్మాణం.. వీటితో పాటు 12 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, 225 కోట్ల వ్యయంతో 56 లక్షల మంది విద్యార్థులకు యూనిఫారాలు, 127 కోట్ల వ్యయంతో పాఠ్య పుస్తకాలు, 12 కోట్ల వ్యయంతో 7 లక్షల మంది బాలికలకు నాప్‌కీన్స్, 7.50 కోట్ల రూపాయలతో 26వేల మంది బాలికలకు సైకిళ్ల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
రేణిగుంటలో ఘనస్వాగతం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సోమవారం ఉదయం 7.45 గంటలకు చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, శైలజానాధ్, రఘువీరారెడ్డి, పార్ధసారథి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు వచ్చారు. ముఖ్యమంత్రికి రేణిగుంట విమానాశ్రయంలో ఎంపి చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, జిల్లా అధికార యంత్రాంగం స్వాగతం పలికారు. అధికారులతో కొంతసేపు ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలిసింది. అక్కడి నుంచి 8 గంటలకు కరకంబాడి వద్ద ఉన్న మంత్రి గల్లా అరుణ ఇంటికి చేరుకుని అల్పాహారం స్వీకరించారు. అనంతరం 8.45 గంటలకు రోడ్డు మార్గాన చంద్రగిరికి చేరుకున్నారు. చంద్రగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకుని విద్యా పక్షోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నారు.