ఇష్టమైందే చదవండి ..కష్టమైంది వద్దు

విద్యార్థులతో సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): రాయడం.. నేర్చినట్టుగానే ఏం చదువుకోవా లన్న విషయాన్ని మీరే నిర్ణయించుకోండి అని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యార్థుల కు ఉద్బోధించారు. బుధవారంనాడు కుత్బుల్లా పూర్‌ సమీపంలోని సూరారం క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న మల్లారెడ్డి మెడికల్‌ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. ఇష్టపడిన దానినే చదవండి.. అదేవిధంగా కష్టపడి చదవండి.. విజేతలు కావడం ఖాయమన్నారు. తల్లిదండ్రులు చెప్పారనో.. హితుల కోరిక మేరకో ఇష్టం లేనిదానిని చదవకండి. కాలాన్ని వృధా చేసుకోకండి. ఇబ్బందులకు గురి కాకండి. మీ నిర్ణయానికి మీరే అధిపతులు.. మీరే నిర్ణేతలు.. ఆ దిశగానే అడుగులు వేయండి.. ముందుకు సాగండి అంటూ ముఖ్యమంత్రి హితవు చెప్పారు. తల్లిదండ్రులు.. సన్నిహితుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకోకండి. వారికి మీ ఆలోచనను చెప్పండి.. మీ ఇష్టాన్ని తెలియజేయండి అని సూచించారు. పిల్లలు కోరుకునే వాటినే ఎలాగైతే అందిస్తారో.. అదేవిధంగా వారు కోరుకున్న చదువునే చదువుకోనీయండి అంటూ తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. దయచేసి మీ అభిప్రాయాలను వారిపై రుద్దకండి. వారి ఇబ్బందులకు బాధ్యులు కాకండి అంటూ సిఎం సూచించారు. ప్రపంచంలో టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతోంది. వాటికి అనుగుణంగా యువత ముందుకు దోసుకుపోతోంది. వారికి వారి గురించి తెలుసు. వారిని ముందుకు సాగనీయండి అంటూ హితం పలికారు. చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ ఇచ్చి వారి చదువు నిరాటంకంగా కొనసాగేందుకు పాటు పడుతోందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ డాక్టర్లు.. ఇంజనీర్లు కండి.. తద్వారా రాష్ట్ర, దేశ అభివృద్ధికి కృషి చేయండి అంటూ పిలుపునిచ్చారు.