ఇసుక రవాణాతో వాణిజ్య శాఖకు టోపీ
మహారాష్ట్ర ఇసుకతో జోరుగా వ్యాపారం
ఆదిలాబాద్,మే28(జనం సాక్షి): మహారాష్ట్ర ఇసుకతో జిల్లాలో జోరుగా వ్యాపారం సాగుతోంది. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో అక్కడి నుంచి ఇసుక భారీగా జిల్లాకు తరలివస్తోంది. జిల్లా సరిహద్దులో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇసుక అక్రమ రవాణా దందా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో నాణ్యమైన ఇసుక లభించకపోవడం ఇసుక వ్యాపారులకు వరంగా మారింది. ఇదే అదనుగా మహారాష్ట్ర నుంచి ఇసుకను లారీల్లో తరలిస్తున్న కొందరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పన్నులు చెల్లించకుండానే వీరు లారీలను దింపుతున్నారు. ధర ఎక్కువైనా ఇళ్ల యజమానులు కొనుగోలు చేయడానికి వెనుకాడడం లేదు. దీంతో ఇసుక వ్యాపారుల దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి లారీల్లో ఇసుకను జిల్లాకు తీసుకువస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఇసుక లారీలు మన రాష్ట్ర సరిహద్దులో టన్నుకు రూ.200 చెల్లించాల్సి ఉండగా అధికారులు ఇవేవిూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. జిల్లాలోని పెన్‌గంగా నది పరీవాహక ప్రాంతాలైన భీంపూర్, తాంసి, బేల మండలాల్లో ఇసుక ఉన్నా నాణ్యత సరిగా లే కపోవడంతో ఇక్కడి ఇసుక వినియోగం తక్కువగా ఉంటుంది. దీంతో భవన నిర్మాణాలకు పక్కనే ఉన్న గోదావరి, పెన్‌గంగా ఇసుకను వినియోగిస్తారు. ఈ ఇసుక మేలు రకంగా ఉండడంతో వినియోగం అధికంగా
ఉంటుంది. మేలురకమైన ఇసుకను వినియోగిస్తుండడంతో మహారాష్ట్ర ఇసుకకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అక్కడి నుంచి ఇసుకను తరలించే వారు సైతం క్రమంగా పెరుగుతున్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి రోజు 15 నుంచి 20 లారీల వరకు ఇసుక జిల్లాకు రవాణా అవుతోంది. కొందరు అక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా మరికొందరు అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకువస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఇసుకను తీసువచ్చే వాహనాలకు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు జిల్లా సరిహద్దు ప్రాంతంలో పన్నుల వసూలు చేయాలి. రోజూ లారీల్లో వందల కొద్ది టన్నుల్లో ఇసుక తరలివస్తున్నా ఎలాంటి పన్నులు వసూలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వాదాయానికి నష్టం వాటిల్లుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక వాహనదారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి ఇసుక జిల్లాకు చేరుతున్నా ఈ విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి మహారాష్ట్ర నుంచి వచ్చే లారీలకు పన్నులు వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.