ఇస్రో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలం కావడం షాక్‌

దీనిని అధిగమించే సత్తా ఇస్రోకు ఉందన్న మాధవన్‌ నాయర్‌
బెంగళూరు,అగస్టు12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంపై సంస్థ మాజీ చైర్మన్‌ జి.మాధవన్‌ నాయర్‌ స్పందించారు. ఇది తమకు పెద్ద షాక్‌ అని వ్యాఖ్యానించారు. అయితే.. ధృఢసంకల్పం కలిగిన ఇస్రో త్వరలోనే పుంజుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఉదయం జీఎస్‌ఎల్‌వీ`ఎఫ్‌10 రాకెట్‌.. ఈఓఎస్‌`03 ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ తో నింగికెగసిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి సంబంధించి తొలి రెండు దశలు విజయవంతమైనప్పటికీ..మూడో దశ అయిన క్రయోజెనిక్‌ స్టేజీలో సాంకేతిక సమస్య ఎదురవడంతో ప్రయోగం విఫలమైంది. అయితే.. ఈ వైఫల్యం అసాధారణమైనదేవిూ కాదని మాధవన్‌ నాయర్‌ పేర్కొన్నారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రయోగం. సాధారణంగా..ఇతర దశలతో పోలిస్తే క్రయోజెనిక్‌ స్టేజీ చాలా కష్టమైనదని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా క్రయోజెనిక్‌ సాంకేతికతపై ఇస్రో పట్టుసాధిస్తోందని నాయర్‌ చెప్పారు. ఐరోపా దేశాలు, రష్యా చేపట్టిన ప్రయోగాల్లో 20 శాతం క్రయోజెనిక్‌ దశలో వైఫల్యం చెందాయని చెప్పిన ఆయన…వీటితో పోలిస్తే ఇస్రో ట్రాక్‌ రికార్డ్‌ అంత దిగదుడుపుగా ఏవిూ లేదని స్పష్టం చేశారు. క్రయోజెనిక్‌ టెక్నాలజీకి సంబంధించి ఇస్రోకు ఇది ఎనిమిదో ప్రయోగం. మొదటి ప్రయోగం విఫలమైంది. ఆ తరువాత చేపట్టిన మిషన్లు అన్నీ విజయవంతమయ్యాయి. అయితే..ఇటువంటి సంక్లిష్ట ప్రయోగాలు విఫలమయ్యే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి..నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ
వైఫల్యం మా అందరికీ షాకే. దీని నుంచి బయపటపడతాం. మళ్లీ పట్టాలెక్కేస్తాం. ఇటువంటి సమస్యలను ఎదుర్కొనే ధృఢసంకల్పం ఇస్రోకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.