ఈజిప్టులో మిలిటెంట్ల దాడి: 30 మంది మృతి

1

కైరో: ఈజిప్టులోని ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో  తీవ్రవాదులు గురు వారం విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 27 మంది సైనికులు, ఒక పౌరుడు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో 60 మంది వరకూ గాయాలపాలయ్యారు. ఎల్‌ ఆరిస్‌ పోలీసుల ప్రధాన కార్యాలయంపై చేసిన దాడిలో ఉగ్రవాదులు కారు బాంబులు, క్షిపణులు ఉపయోగించి వరుస కాల్పులు జరిపారు. చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు ఆరు నెలలు మాత్రమే. అంతకుముందు సూయజ్‌ కెనాల్‌సిటీపై దాడి చేయడానికి ఏర్పాటు చేసిన కారు బాంబు పేలడంతో ఒక పోలీసు అధికారి మరణించారు. ఈ ఘటనలతో ఈజిప్టు అధ్యక్షుడు తన ఇథియోపియా పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇరాక్‌లో కిర్కుక్‌, బాగ్దాద్‌ ప్రాంతాల్లో తీవ్రవాదుల దాడి

బాగ్దాద్‌: ఇరాక్‌లోని కిర్కుక్‌, బాగ్దాద్‌ ప్రాంతాల్లో ఇస్లామిక్‌ తీవ్రవాదులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడుల్లో 21 మంది మృత్యువాత పడ్డారు. కిర్కుక్‌ నగరానికి నైరుతి దిశగా ఉన్న జిల్లాల్లో సైన్యంపై క్షిపణులతో ఈ దాడి చేసినట్లు కిర్కుక్‌ పోలీసులు వివరించారు. మరోవైపు బాగ్దాద్‌లో బాంబులతో దాడి చేశారు. దీనిలో 21 మంది మృత్యువాత పడ్డారు.

తీవ్రంగా ఖండించిన అమెరికా

వాషింగ్టన్‌: ఈజిప్టులోని ఉత్తర సినాయ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని అమెరికా శుక్రవారం తీవ్రంగా ఖండించింది. ఆ ఘటనలో చనిపోయిన వారికి సంతాపం తెలిపినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి జెన్‌ సాకీ తెలిపారు. ఈజిప్టులో శాంతి వాతావరణం నెలకొల్పడానికి, ఉగ్రవాదులను తరిమికొట్టడానికి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.