ఈడీ విచారణలో కీలక సమాచారం!?
– ఎమ్మార్ కేసులోనూ పురోగతి
– సిబిఐ దర్యాప్తు డేటాతో క్రోడీకరణ
హైదరాబాద్, జూన్ 27 : దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఓబుళాపురం గనుల లావాదేవీలు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలు, జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. చివరి రోజున ఈడి అధికారులు చంచల్‌గూడ జైల్లోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, కోనేరు ప్రసాద్, ఎమ్మార్ ఎంజిఎఫ్ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక విభాగం ఛైర్మన్ విజయరాఘవన్, వైఎస్ జగన్ సన్నిహితుడు సునీల్‌రెడ్డిలను ఏడు గంటల పాటు విచారించారు. ఓఎంసీ, ఎమ్మార్ ప్రాపర్టీస్, జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఈడి మొదటి దఫా విచారణలో అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారంతో పాటు తమ అనుమానాలకు సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని విచారించేందుకు ఈడి అధికారులు సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం ఓఎంసి కేసుకు సంబంధించి అరెస్టయిన నాటి గనుల శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఓఎంసి ఎండి శ్రీనివాస్‌రెడ్డిలను అధికారులు విచారించారు. రెండవ రోజు సోమవారం జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎసఅధికారి బిపి ఆచార్య, ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌లతో పాటు ఓఎంసి కేసుకు సంబంధించి శ్రీనివాస్‌రెడ్డిని ఈడి విచారించింది. ఇక మూడవ రోజున బిపి ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్, విజయరాఘవన్, సునీల్‌రెడ్డిలను సుదీర్ఘంగా విచారించారు. ఎమ్మార్ కేసుకు సంబంధించిన ఈడి విచారణలో విల్లాల విక్రయాలు, ఎపిఐఐసి భూములను అప్పణంగా నిబంధనలకు విరుద్దంగా ఎమ్మార్, ఎంజిఎఫ్‌లకు కేటాయించడం వంటి అంశాలున్నట్లు తెలిసింది. ఇదే విషయమై ఆచార్యను ఈడీ అధికారులు మూడు గంటల పాటు విచారించారని సమాచారం. దీంతో పాటు మిగతా ముగ్గురు నిందితులను కూడా ఈడి పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. మనీలాండరింగ్‌తో పాటు ఆర్థిక నేరాలకు సంబంధించిన ప్రశ్నలను సైతం ఈడి సంధించినట్లు తెలిసింది. హవాలా ద్వారా నిధులు మళ్లింపు విషయంపైనా ఈడి ప్రశ్నించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నలుగురు నిందితులను వారి న్యాయవాదుల సమక్షంలోనే అధికారులు విచారించారు. న్యాయవాదుల సమక్షంలో నలుగురు నిందితులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాచారాన్ని అధికారులు సేకరించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను విచారించిన ఈడి చివరగా వైఎస్ జగన్‌ను విచారించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈడి దాఖలు చేసిన పిటీషన్‌పై సిబిఐ కోర్టు గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించే వీలుంది. ఒకవేళ జగన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజున అధికారులు జగన్‌ను జైల్లోనే విచారించే వీలుంది. మరోపక్క ఒఎంసి, ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి మొదటి దఫా విచారణ పూర్తి చేసిన ఈడి అధికారులు రెండవ దఫా విచారణకు సన్నద్దమవుతున్నారు. మొదటి దఫా విచారణలో హైదరాబాద్‌కు చెందిన అధికారులు పాల్గొనగా, రెండవ దఫా విచారణలో ఢిల్లీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే వీలుంది. ఈ కేసులకు సంబంధించిన నిందితులను కోర్టు అనుమతితో ఢిల్లీకి తీసుకువెళ్లి విచారించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిఓప్రాయపడుతున్నారు. అయితే ఇందుకు సిబిఐ కోర్టు ఏ మేరకు అంగీకరిస్తుందనే అంశం తేలాల్సివుంది. మొత్తానికి మొదటి దఫా విచారణ సందర్భంగా సేకరించిన వివరాల ఆధారంగా ఈడి తన దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది. స్థానిక ఈడి అధికారుల బృందం విచారణ సందర్భంగా తాము నిందితుల నుంచి సేకరించిన వివరాలను దేశ రాజధాని ఢిల్లీలోని ఉన్నతాధికారులకు బుధవారం నివేదిక రూపంలో అందజేశారు. ఇప్పటికే సిబిఐ నుంచి సేకరించిన దర్యాప్తు డేటాతో తాము సమాచారాన్ని క్రోడికరించుకున్న తర్వాత రెండో దఫా విచారణకు ఈడి సిద్ధం కానుందని సమాచారం.