ఈవీఎంలు మొరాయించడం వెనుక బీజేపీ వ్యూహం

– భవిష్యత్తు ఎన్నికల్లో పేపర్‌ బ్యాలెట్‌ పేపర్‌లనే వినియోగించాలి
– యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌
లక్నో, మే29(జ‌నం సాక్షి) : కైరానా, నూర్‌పూర్‌ ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్‌లు సరిగా పనిచేయకపోవడంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ మరోసారి తనగళం విప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై మండిపడ్డారు. దేశంలో జరిగే భవిష్యత్‌ ఎన్నికల్లోనైనా పేపర్‌ బ్యాలెట్లు ఉపయోగించాలని డిమాండ్‌ చేశారు. లక్నోలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిలేష్‌ మాట్లాడుతూ, మహాకూటమి అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లోనే ఈవీఎం, వీవీపాట్‌లో ఎందుకు సరిగా పనిచేయ లేదన్న దానిపై విచారణ జరపాలన్నారు. నేడు ఈవీఎంలు, వీవీపాట్‌లపై జనం నమ్మకం కోల్పోయారు. ఇంకెంతమాత్రం వాటిని ప్రజలు విశ్వసించాలనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్‌ పేపర్లను వాడుతుంటే మనం బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు ఎందుకు జరపలేం?’ ప్రశ్నించారు. ‘ఘట్‌బంధన్‌’ అభ్యర్థులు బలంగా ఉన్నచోటే ఈవీఎంలు పనిచేయలేదంటూ దీని వెనుక ఏదో వ్యూహం ఉండి ఉండాలని, కూటమి అభ్యర్థులకు పట్టున్న ప్రాంతాల్లో లాఠీచార్జీ జరపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అన్నీ పార్టీలు ఈసీ వద్దకు ఫిర్యాదుకు వెళ్లే, తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ కూడా ఈసీ ఫిర్యాదుకు వెళ్లిందన్నారు. ఇప్పుడైనా వారు ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదనే విషయాన్ని ఒప్పుకోవాలన్నారు. ఈసీకి బీజేపీ చెప్పిన కారణాలు నవ్వు పుట్టిస్తున్నాయనీ, తద్వారా తమకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ప్రజలను నిలువరించాలన్న బీజేపీ వ్యూహం బయటపడిందని అఖిలేష్‌ అన్నారు.