ఈ రోజు ప్రజాస్వామ్యం గెలిచింది: రాహుల్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
ప్రధాన మంత్రి దేశ ప్రజల కన్నా, సుప్రీంకోర్టు కన్నా, వ్యవస్థల కన్నా గొప్ప కాదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాన మంత్రి అంటే దేశానికి నాయకత్వం వహించాలని, దేశంలోని వ్యవస్థలను గౌరవించాలని అన్నారు.
కర్ణాటక ప్రజల గొంతును తాము పరిరక్షించామన్నారు. బీజేపీకి కర్ణాటక ప్రజల మద్దతు లేదన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. ఓట్లను పరిశీలించినా, జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కన్నా బీజేపీకి ఓట్లు చాలా తక్కువగా వచ్చాయన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి, సమన్వయంతో బీజేపీని ఓడించాలన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వ శైలి సరికాదని దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ తాను కులతత్త్వవాదిని కాదన్నారు.