ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్‌లో ఉచిత విద్య

4

వరంగల్‌,జూన్‌ 9(జనంసాక్షి): ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తామని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి వెల్లడించారు. అలాగే జూనియర్‌ కాలేజీ భవన నిర్మాణాలకు రూ.9 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో  విద్యాశాఖపై డిప్యూటీ సీఎం కడియం సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి చందూలాల్‌, జడ్పీచైర్‌పర్సన్‌ గద్దల పద్మ, మేయర్‌ నరేందర్‌, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, శంకర్‌నాయక్‌, వినయ్‌భాస్కర్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పూల రవీందర్‌, వెంకటేశ్వర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ…వరంగల్‌ జిల్లాలో 30 మోడల్‌ స్కూళ్లలో 16వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 29 మోడల్‌ స్కూళ్ల భవనాలు, 16 హాస్టల్‌ భవనాలు పూర్తి చేశాం. జిల్లాలో 2,919 పాఠశాలలకు రూ.264 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాట్లు ప్రతిపాదనలు అందాయి. మానవ వనరుల అభివృద్ధి తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేస్తామన్నారు. బడిబాటతో ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య తక్కవగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కోసం బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెడతామన్నారు. వరంగల్‌ జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. ఈ ఏడాది నుంచి 476 ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది టీచర్లతో ఇంగ్లీష్‌ విద్యను అందించనున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. అందులో భాగంగానే 250 రెసిడెన్షియల్‌ పాఠశాలలను సీఎం కేసీఆర్‌ ప్రకటించారని పేర్కొన్నారు.