ఉక్కుకోసం.. ఆగని దీక్ష

– తొమ్మిదవ రోజు దీక్షను కొనసాగిస్తున్న సీఎం రమేష్‌
– రమేశ్‌ ఆరోగ్యంపై అమెరికా వైద్యుడి ఆందోళన
– సంఘీభావం తెలిపిన మంత్రి నారాయణ
– ప్రధానిని కలిసేందుకు యత్నించిన టీడీపీ ఎంపీలు
– అపాయింట్‌ ఇవ్వని ప్రధాని కార్యాలయం
కడప, జూన్‌28(జ‌నం సాక్షి) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేపట్టిన అమరణ నిరాహారదీక్ష గురువారంలో తొమ్మిదో రోజుకు చేరింది. ఉదయం ఆయనకు రిమ్స్‌ వైద్యులు, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్‌ రాజా నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ కూడా తీశారు. చక్కెర స్థాయి, బీపీ బాగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. రిమ్స్‌ వైద్యుల నివేదికను పరిశీలించిన యూఎస్‌ డాక్టర్‌ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రమేష్‌ ఈ పరిస్థితుల్లో ఐసీయూలో ఉండాల్సిందని… టెంట్‌ కింద వైద్య పరీక్షలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఆయన గుండెకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏదైనా జరిగితే ఇక్కడ వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్య బృందాన్ని దీక్షా శిబిరం వద్దనే ఉంచుతున్నట్లు రిమ్స్‌ సూపరింటెండెంట్‌ గిరిధర్‌ తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం రమేష్‌తోపాటు దీక్షలోపాల్గొన్న బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం మధ్యాహ్నం వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన విషయం విధితమే. కాగా రమేష్‌ మాత్రం తాను దీక్షను కొనసాగిస్తానని మొండిగా దీక్షలో కొనసాగుతున్నారు. కాగా ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో రమేష్‌ను కూడా వైద్య చికిత్సల నిమిత్తం గురువారం రాత్రి, శుక్రవారం ఆస్పత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మంత్రి నారాయణ సంఘీభావం..
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌ను ఆంధప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి నారాయణ పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. రమేశ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా దీక్ష నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చలనం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో కడపల ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని హావిూలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. ఏపీలోని బీజేపీ నేతలు ఇష్టామొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తద్వారా కడప అభివృద్ధికి తోడ్పాటునందించాలని మంత్రి కోరారు.
టీడీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వని మోదీ..
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటును కోరుతూ తెదేపా నేతలు చేస్తున్న దీక్షను కేంద్ర మంత్రికి బుధవారం టీడీపీ ఎంపీలు వివరించారు. దీక్షలో కూర్చున్నవారి ఆరోగ్యం విషమంగా మారుతుందని తక్షణమే స్టీల్‌ ఫ్యాక్టరీపై తక్షణమే ఓ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా గురువారం పీఎం నరేంద్రమోడీని కలిసి పరిస్థితిని వివరించేందుకు తెదేపా ఎంపీలు ప్రయత్నించారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్‌ కోరుతూ ప్రధాన కార్యాలయంను కోరగా మోదీ అపాయింట్‌ దొరకలేదు. దీంతో మళ్లీ కేంద్ర మంత్రితో మాట్లాడి ఉక్కు ఫ్యాక్టరీపై ఓ ప్రకటన చేయించేలా తెదేపా ఎంపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.