ఉగ్రవాదం ఉమ్మడి శత్రువు : రాష్ట్రపతి
బంగ్లాలో ప్రణబ్‌కు ఘన స్వాగతం
డాకా, మార్చి 3 (జనంసాక్షి) :
ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ఆయన తొలి విదేశీ పర్యటనకు ఆదివారం బయలు దేరివెళ్లారు. డాకాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ జులుర్ రహమాన్, ప్రధాని షేక్ హసీనా, ఇతర ప్రముఖులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. బంగ్లా సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఏటీఎన్ బంగ్లా అనే టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉగ్రవాదం అన్ని దేశాల్లో శాంతి సామరాస్యాలను దెబ్బతీస్తోందని తెలిపారు. ఇప్పుడు సమాజానికి ఉగ్రవాదంతో పెన్ సవాల్ ఎదురవుతోందని తెలిపారు. ప్రాంతాలు, మతాలకు అతీతంగా ఉగ్రవాదం ఉందని తెలిపారు. ఉగవాద నిర్మూలనకు ఉమ్మడి కార్యాచరణ అమలు చేయాలని కోరారు. కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా ఉంది. 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటం సందర్భంగా చోటు చేసుకున్న అమానవీయ ఘటనలకు సంబంధించి ముగ్గురు జమాతే ఇస్లామీ నేతలకు అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ విధించిన మరణశిక్షల నేపథ్యంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగి దాదాపు 50 మందిని బలిగొంది. మరణశిక్షలకు నిరసనగా ఆ పార్టీ దేశంలో 42 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌కు ప్రణబ్ వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధానమంత్రి షేఖ్ హసీనాతో పాటు ప్రతిపక్ష నాయకురాలు ఖలిదా జియా తదితరులతో సమావేశమవుతారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం మార్చి 4వ తేదీన ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి గౌరవించనుంది. ఢాకా యూనివర్శిటీ ఒక ప్రత్యేక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి భారత రాష్ట్రపతికి డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. రాష్ట్రపతి పర్యటనపై విదేశాంగ కార్యదర్శి రంజన్ మాతై మాట్లాడుతూ ఈ యాత్ర రాజకీయ చర్చలతో ముడిపడింది కాదన్నారు. భారత్ – బంగ్లాదేశ్‌ల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పైస్థాయికి చేర్చడం, అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోవడం పట్ల భారత్‌కు గల నిబద్ధతను ఆ దేశానికి భారత రాష్ట్రపతి తెలియజేస్తారన్నారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రణబ్ ముఖర్జీ తమ కుటుంబీకుల పురాతన నివాసం ఉన్న నారైల్ జిల్లాలోని భద్రబిల గ్రామాన్ని సందర్శిస్తారు. ఇంకా, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కుటుంబానికి చెందిన ఎస్టేట్ ఉన్న కుస్తియా జిల్లాలోని షిలైడా గ్రామానికి కూడా వెళతారు. రవీంద్రులు ఇక్కడి నుంచి పలు కవితలు, చిన్న కథలు, వ్యాసాంగాల రచన చేశారు. అనంతరం బంగ్లా ప్రధానితో భేటీ అయి ఉగ్రవాదం, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.