ఉత్తరం మాధుర్యాన్ని మరచిన జనం ( నేడు తపాలా దినోత్సవం )

న్యూఢల్లీి,అక్టోబర్‌9  (జనంసాక్షి): ఇంటర్నెట్‌ పెరిగి సమాచారం అరచేతిలోకి వచ్చిన నేటి తరానికి తపాలా గురించి ..లెటర్ల గురించి అంతగా తెలియకపోవచ్చు. అక్టోబర్‌9న ప్రపంచ తపాలా దినోత్సవం.ఉత్తరం అందుకోవడం, రహస్యంగా విప్పి చదువుకోవడం, ఎవరైనా వస్తుంటే దిండికింద దాచుకోవడం ప్రేమికులకు ఖర్చులేని ఓ మధురానుభూతి. దూరంగా సైన్యంలోనో , మరో ఉద్యోగంలోనో ఉన్న భర్తో, కోడుకో ఉత్తరం రాస్తాడనీ, క్షేమ సమాచారం చెబుతాడనీ వీధి వంక చూస్తూ గడిపే కాలం ఇంకా మధురమైనది. అయితే సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు రాసుకునే తరం అంతరించిపోయింది. ఇంటికి వచ్చిన ఉత్తరాలను పొడవాటి ఇనుప కవ్మిూకి గుచ్చిఉంచడం. అవసరమైనపుడు మళ్లీ తీసి చదువుకోవడం రెండు మూడు దాశాబ్దాల క్రితం ప్రతి ఇంటా ఉండేది. రోజులు మారి, కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్లు, అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన నేటికాలంలో ఉత్తరాలు రాయటం దాదాపు లేదనే చెప్పాలి. ఇపుడు పోస్ట్‌ అంటే
బ్యాంకు నుంచి, సెల్‌ ఫోన్‌ కంపెనీల నుంచీ వచ్చే బిల్లులు, డేటా వివరాలు మాత్రమే. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతో సమాచారాన్ని దూరతీరాలలోని ఆత్మీయులకు చేరవేయడానికి తపాలా రంగం అందించిన సేవలు వెలకట్టలేనివి. ఐక్యరాజ్య సమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 9వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అంతర్జాతీయ పోస్టల్‌ యూనియన్‌ 1874లో అక్టోబర్‌9న ఏర్పడిన సందర్భంగా ఆ రోజునే అంతర్జాతీయ పోస్టల్‌ డేగా ఎంచుకున్నారు. ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో భారత తపాలా రారాజు లాంటిది. భారత దేశంలో మార్చి 31,2015 నాటికి దేశవ్యాప్తంగా 1,54,939 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 1,39,222(89.86శాతం) గ్రావిూణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్న తపాలా కార్యాలయాలు 23,344 మాత్రమే.మన దేశంలో పిన్‌ కోడ్‌ విధానంఉత్తరాల బట్వాడాలో వేగం, కచ్చితత్వాన్ని సాధించడానికి 1972 ఆగస్టు 15న పిన్‌ కోడ్‌ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు. పిన్‌ కోడ్లో ఆరు అంకెలు ఉంటాయి. మొదటి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్‌ జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడంకెలు డెలివరీ పోస్టాఫీసును తెలియజేస్తాయి. దేశాన్ని మొత్తం 9 పిన్‌ కోడ్‌ జోన్లుగా విభజించారు. ఇప్పటికీ పిన్‌కోడ్‌ మాత్రం మారలేదు.