ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షం

నిలిచిపోయిన సహాయ చర్యలు
వేల సంఖ్యలో బాధితులు
డెహ్రాడూన్‌, జూన్‌ 24 (జనంసాక్షి) :
ప్రకృతి మళ్లీ కన్నెర్రజేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌పై విరుచుకుపడి సర్వనాశనం చేసిన వరుణుడు.. తాజాగా మళ్లీ విజృంభించాడు. చార్‌ధామ్‌ యాత్రికుల తరలింపుపై నీళ్లు కుమ్మరించాడు. దీంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యలు నిలిచిపోయాయి. కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయక చర్యల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెనలు నేలమట్టమయ్యాయి. దీంతో సోమవారం సహాయక చర్యలకు విఘాతం కలిగింది. నాలుగు రోజులుగా వరద బాధితులను చేరవేతస్తున్న 40కి పైగా హెలీకాప్టర్లు నిలిచిపోయాయి. వాతావరణం అనుకూలించక పోవడంతో సహస్రధారలోనే ఆగిపోయాయి. దీంతో పౌరీ, చమోలీ, రుద్రప్రయాగ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కూడా సహాయక చర్యలు నిలిచిపోయాయి. యాత్రికుల తరలింపు వాయిదా పడిరది. బద్రీనాథ్‌, దాని పరిసరాల్లో చిక్కుకున్న వారిని తరలించడానికి సోమవారం ఉదయం నుంచి సహస్రధార హెలీపాడ్‌ నుంచి ఒక్క హెలీకాప్టర్‌ వెళ్లేందుకు కూడా వీలు కాలేదు. గుప్తకాశీ, గౌచార్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షం, దట్టమైన పొగ వల్ల హెలికాప్టర్లు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు, ఇంకా వేల మంది యాత్రికులు వరదల్లో చిక్కుకొని ఉన్నారు. పది వేల మందికి పైగా ఇంకా చిక్కుకుపోయారని, వర్షాల వల్ల వారిని తరలించే ప్రక్రియకు విఘాతం కలిగిందని అధికారులు తెలిపారు. ‘బద్రినాథ్‌ నుంచి ఇంకా 5 వేల మందికి పైగా తరలించాల్సి ఉంది. కానీ, వాతావరణం అనుకూలించక పోవడంతో ఒక్క హెలీకాప్టర్‌ కూడా సహస్రధార హెలీప్యాడ్‌ నుంచి బయల్దేరలేదని’ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ కెప్టెన్‌ ఆర్‌ఎస్‌ బ్రార్‌ తెలిపారు. వాతావరణం సహకరిస్తే సహాయక చర్యలను ప్రారంభిస్తామన్నారు. బద్రినాథ్‌ సహా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు మందులు, ఆహారం అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
పెరుగుతోన్న మృతుల సంఖ్య
మరోవైపు, రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 628 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.. అనధికారంగా కొన్ని వేల మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు 5 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని తెలిపారు. మరోవైపు, మృతుల సంఖ్య వెయ్యికి చేరిందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే సోమవారం చెప్పారు. బురద, శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ‘వెయ్యికి పైగా మృతి చెందినట్లు సమాచారముంది. పేరుకుపోయిన బురద,  శిథిలాలను తొలగిస్తే ఆ సంఖ్య మరింత పెరగొచ్చు’ అని అన్నారు. బద్రినాథ్‌ పరిసరాల్లో చిక్కుకున్న వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే, వర్షాల వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలిగిందని తెలిపారు. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న వారిని తరలించడమే ప్రధానంగా పెట్టుకున్నామని చెప్పారు. కేదార్‌నాథ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, దాని కంటే బద్రినాథ్‌ బాగుందన్నారు. బద్రినాథ్‌లో ఆహారం, నీరు అందుబాటులో ఉందని వివరించారు.
మృతుల అంత్యక్రియలు అక్కడే…
చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి మృతదేహాలకు ఉత్తరాఖండ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలు కుళ్లిపోతున్నందున ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. దహన సంస్కారాల కోసం 50 టన్నుల కలపను, నెయ్యిని సిద్ధం చేశామన్నారు. అయితే, మృతులను గుర్తు పట్టేందుకు వీలుగా మృతదేహాల ఫొటోలను తీసి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ‘కేదార్‌నాథ్‌లో వాతావరణం అనుకూలిస్తే ఈ రోజు నుంచే అంత్యక్రియలు ప్రారంభిస్తాం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు అందాయి’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేదార్‌నాథ్‌లో మృతి చెందిన వారి మృతదేహాలకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించాలని, లేకుంటే మృతదేహాలు మరింత కుళ్లిపోయే అవకాశముందన్నారు.