ఉత్తరాఖండ్‌లో వరదలు తగ్గుముఖం


ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వే
వెయ్యి కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
కొనసాగుతున్న సహాయ చర్యలు
డెహ్రాడూన్‌, జూన్‌ 19 (జనంసాక్షి) :
భారీ వర్షాలు, వరదల తాడికిడితో ఉక్కిరిబిక్కిరైన ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల సాయం ప్రకటించింది. బుధవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో కలిసి ఉత్తరాఖండ్‌లో పరిస్థితిని ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించారు. అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం మృతుల సంఖ్య 102గా ఉన్నప్పటికీ అది బాగా పెరిగే అవకాశముందని అన్నారు. పదివేల మందిని రక్షిచినప్పటికీ ఇంకా చాలా మంది వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తక్షణ సాయంగా రూ.145 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 5,500 మంది జవాన్లు, సైనికాధికారులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన మూడు వేల మంది, 600 మంది ఇండో టిబెటన్‌ బోర్డన్‌ జవాన్లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. భారత వాయుసేన 18 హెలిక్యాప్టర్ల ద్వారా, సీ`130 విమానంతో సేవలందిస్తోందని వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.
వరదలతో అల్లకల్లోలంగా మారిన ఉత్తరాది ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఉగ్రరూపం దాల్చిన గంగానది శాంతిస్తోంది. వరద బీభత్సం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, వర్ష బీభత్సానికి మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 138 మంది మృత్యువాత పడినట్లు అధికారులు ప్రకటించారు. చారధామ్‌ తీర్థయాత్ర సాగే మార్గంలో సహాయక చర్యలకు వెళ్లిన వారు ఇస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ప్రాణ నష్టం వేలల్లో ఉండే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు. ఒక్క ఉత్తరాఖండ్‌లోనే 109 మంది మృతి చెందగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 29 మంది కన్నుమూశారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 73 వేల మందిలో ఇప్పటివరకు పది వేల మందిని రక్షించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సైన్యం, జాతీయ విపత్తుల నిర్వహణ దళ సభ్యులు సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. రుద్రప్రయాగలో చిక్కుకున్న 2,700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం తగ్గుముఖం పట్టడం, వాతావరణం సహకరించడంతో సహాయక చర్యలు విస్తృతంగా సాగుతున్నాయి. బద్రినాథ్‌లో చిక్కుకుపోయిన 12 వేల మంది యాత్రికులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని సురక్షితంగా తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 14 హెలికాప్టర్లు యాత్రికులను తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి, వరదల చిక్కుకున్న వారికి ఆహార పొట్లాలు, మందులు, దుప్పట్లు అందజేస్తున్నారు. చమోలి ప్రాంతంలో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని గుర్తించాల్సి ఉందని కలెక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా ఇప్పుడిప్పుడి కోలుకుంటోంది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మరో హెలికాప్టర్‌ వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరోవైపు, వరద బీభత్సాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన విూడియా ప్రతినిధులు పూప్‌ా ప్రాంతంలో చిక్కుకుపోయారు. రెండ్రోజులుగా భారీ వర్షాలు, దట్టమైన మంచు కురుస్తుండడంతో వారు కొండ ప్రాంతంలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించారు.
ఉత్తరాఖండ్‌కు పలు రాష్ట్రాల చేయూత
వరదలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాఖండ్‌ను ఆదుకొనేందుకు పలు రాష్టాల్రు ముందుకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.25 కోట్లు, హర్యానా రూ.10 కోట్లు, మధ్యప్రదేశ్‌ రూ.5 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఎడతెరిపి లేని వానలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపానికి గురైన ఉత్తరాఖండ్‌ ప్రజలకు చేతనైన సాయం అందజేయాలని ఆయన తమ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ కూడా రూ.5 కోట్ల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు అందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, హర్యానా ప్రభుత్వం కూడా రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వరదలతో నష్టపోయిన ఉత్తరాఖండ్‌కు హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడా రూ.10 కోట్ల సాయం అందజేస్తామని తెలిపారు.
యాత్రికుల అవస్థలు…
వరదల్లో చిక్కుకుపోయిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. వరదల నుంచి ఎలాగోలా బయటపడిన వారికి తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు దొరక్కా అల్లాడుతున్నారు. కేవలం అరటి పండ్లు తిని కొందరు పూట గడుపుతుంటే, మరికొందరు నీళ్లు తాగి కడుపు నింపుకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్లేటు భోజనానికి రూ.300, వాటర్‌ బాటిల్‌కు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక, చార్‌ధామ్‌ యాత్రకు వచ్చిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే కావడం, వారు చలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఇప్పటికే జ్వరాల బారిన పడ్డారు. మందుబిళ్లలు కూడా అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.