ఉత్తరాఖండ్‌లో సైన్యం సేవల్‌ భేష్‌


ఉత్తరాఖండ్‌లో సైన్యం సేవల్‌ భేష్‌ అని, వరదల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే సహాయక చర్యలు ముమ్మరం చేస్తామని, మరిన్ని రెస్క్యూ టీంలను ఉత్తరాఖండ్‌కు పంపిస్తామన్నారు. గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్‌ వచ్చిన బిక్రమ్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో ఆదివారం వాతావరణంలో మార్పులు ఉంటాయని, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. అందుకే అత్యంత వేగంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నామన్నారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 6,200 మంది ఆర్మీ సిబ్బందిని పంపించామన్నారు. వాతావరణం అనుకూలిస్తే మరింత సిబ్బందిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద బాధితులకు అవసరమైన ఆహారం, మందులు, ఇతర వస్తువులను అందజేస్తున్నట్లు చెప్పారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఎప్పటిలాగే ఈసారి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనే భక్తులకు భద్రత కల్పిస్తామన్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులకు ఉగ్రవాదల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న వార్తలపై స్పందిస్తూ.. అవి (ప్రమాదాలు) ఎప్పటి నుంచో ఉన్నాయని, ఎలాంటి ఘటనలనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సైన్యం, కేంద్ర, రాష్ట్ర బలగాలతో సమన్వయం చేసుకుంటూ యాత్రికులకు గట్టి భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.