ఉత్తరాఖండ్‌ అతలాకుతలం

వరద బీభత్సానికి 81కి చేరిన మృతులు
కొనసాగుతున్న సహాయక చర్యలు
బాధితుల్లో తెలుగువారు మూడు వేలు
డెహ్రాడూన్‌, జూన్‌ 18 (జనంసాక్షి) :
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం అయింది. వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు ముంచెత్తడంతో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంగళవారం కూడా వర్షం తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికే వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి 81కి చేరింది. ఉత్తరాఖండ్‌లో 60 మందికి పైగా, యూపీలోని సహరన్‌పూర్‌లో 18 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్‌, కేదర్నాథ్‌ యాత్రకు వెళ్లిన 58 వేల మంది వరదల్లో చిక్కుకున్నారు. వీరిలో మూడు వేల మంది తెలుగు వారు ఉన్నారు. గంగోత్రి, యమునోత్రి వద్ద 50 వేల మందికి పైగా యాత్రీకులు చిక్కుకున్నారు. అలకానంద నది రుద్రప్రయాగ జిల్లాలో బీభత్సం సృష్టించింది. 40 హోటళ్లతో పాటు 73 భవనాలు కొట్టుకుపోయాయి. 23 మంది మృత్యువాత పడ్డారు. వరద బీభత్సానికి 80 కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం నెలకొంది. వరదల్లో చిక్కుకొన్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిక్కుల పవిత్ర ప్రాంతమై హేమకుంత్‌ సాహేబ్‌ కూడా నీట మునిగింది.భారీ వర్షాలతో గంగానది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద మట్టానికి మించి రెండు విూటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. వరద ఉధృతికి ఇళ్లు, వసతిగృహాలు నేలమట్టమయ్యాయి. రహదారులు పూర్తిగా శిథిలామయ్యాయి. అలకానంద నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలను నీటమునిగాయి. వరదల కారణంగా కైలాశ్‌ మానస సరోవర్‌ యాత్రను, అలాగే, చార్‌ధామ్‌ రద్దు చేశారు. వాతావరణం అనుకూలించి మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకూ యాత్రలను నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. గంగానది పరిసర వాసులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని పేర్కొంది. మరోవైపు, సైన్యం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బరేలి, సర్సవా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సైన్యానికి చెందిన 14 హెలీకాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) బలగాలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నా.. వాతావరణం అనుకూలించకపోవడంతో డెహ్రాడూన్‌లోనే నిలిచిపోయాయి. పరిస్థితి హృదయవిదారకంగా ఉందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. వసతికేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 450కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. వరదల కారణంగా శ్రీగంగానగర్‌, హేమకుంద్‌ ఎక్స్‌ప్రెస్‌, జనశతాబ్ది రైళ్లను రద్దు చేశారు.వరదల్లో చిక్కుకున్న హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ సహా 1700 మందిని సురక్షితంగా తరలించారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన మూడ్రోజులుగా కిన్నౌర్‌ జిల్లాలో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సైన్యం సీఎంతో పాటు 1700 మందిని హెలికాప్టర్‌లో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
వరదల్లో 3 వేల మంది తెలుగువారు
ఉత్తర కాశీ వద్ద సుమారు మూడు వేల మంది తెలుగు వారు చిక్కుకున్నారని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. వరదల్లో చిక్కుకున్న వారి సమాచారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి తెలిపింది. విశాఖపట్నం, రంగారెడ్డితో పాటు పలు జిల్లాలకు చెందిన వారు ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయారు. చిక్కుకున్న వారి క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురు చూస్తున్నారు. భారీవర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ వారికి మూడ్రోజులుగా తాగునీరు, తిండి సదుపాయం అందడం లేదని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షనమే స్పందించి తమ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. మరోవైపు వరదల్లో చిక్కుకున్న రంగారెడ్డి జిల్లా వాసుల కోసం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం 040` 2323 7417, 89784 66886 నంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.