ఉత్తరాఖండ్‌ మృతులు వేల సంఖ్యలో

1800 మంది తెలుగువాళ్ల గల్లంతు
ఏపీ భవన్‌కు చేరిన యాత్రికులు
ఎవరికి వారే ‘యమున’ తీరం
డెహ్రాడూన్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరద బీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్యలో వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కేదర్‌నాథ్‌ క్షేత్రం పరిసరాల్లో చిక్కుకుపోయిన, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాకపోవడం, అక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో మృతుల సంఖ్య స్పష్టంగా తెలియరాకున్నా జన నష్టం భారీ సంఖ్యలోనే జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో మొత్తం మూడు వేల మంది తెలుగువాళ్లు గల్లంతు కాగా, ఇప్పటివరకు కేవలం 1200 మంది మాత్రమే ఆచూకీ లభ్యమైంది. మిగతా 1800 మందికి సంబంధించిన సమాచారమేది తెలియరాలేదు. వరదల్లో చిక్కుకొని రాష్ట్రానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. మృతులంతా విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన వారిగా గుర్తించారు. విశాఖకు చెందిన 15 మంది సభ్యుల బృందం పదిహేను రోజుల క్రితం ఉత్తర కాశీయాత్రకు బయల్దేరింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లను వరద ముంచెత్తడంతో వీరంతా కేదార్‌నాథ్‌ సమీపంలో గల్లంతయ్యారు. వీరిలో కామేశ్వరి (68), సూర్యప్రకాశరావు (65), రత్న (60), ఆదిలక్ష్మి, సీతారామాస్వామి మృతి చెందారు. కేదార్‌నాథ్‌ సవిూపంలోని రాంపూరు చెక్‌పోస్టు వద్ద వీరి మృతదేహాలు లభించినట్లు ఉత్తరాఖండ్‌ అధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఈమేరకు బంధువులకు కూడా సమాచారం అందింది.
ఆచూకీ లేని 1800 మంది
రాష్ట్రానికి చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. 1800 మంది ఆచూకీ లభించక పోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2,100 మంది యాత్రికుల్లో 1800 మంది ఆచూకీ లభించలేదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ సర్కారుకు సమాచారమిచ్చింది. వీరిలో చాలా మంది మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన వారు ఏడుగురు గల్లంతయ్యారు. దుగ్గిరాలకు చెందిన మల్లీశ్వరి, మున్నంగికి చెందిన కుమారి, అమరావతికి చెందిన దంపతులతో సహా ఏడుగురి ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు, హైదరాబాద్‌ కుషాయిగూడకు చెందిన 25 మంది, కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన 18 మంది ఇంకా వరదల్లోనే చిక్కుకుపోయారు. వారి క్షేమ సమాచారం తెలియన కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కాగా, వరదల బీభత్సానికి ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కాశీలోని నాలా పానీ వద్ద 160 మంది చిక్కుకున్నారు. గౌరీకుండ్‌లో 50 మంది కర్నూలు వాసులు, కేదారినాథ్‌లో విశాఖకు చెందిన 12 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి సంజయ్‌కుమార్‌ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. కేదారినాథ్‌లో ఐదు వేల మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారని, వరదలతో అక్కడి రోడ్లన్నీ తెగిపోయాయని ఆయన తెలిపారు. బాధితులను తీసుకురావడానికి వారం రోజులు పడుతుందని, బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హెలీకాప్టర్ల ద్వారా రాష్టాన్రికి చెందిన వారిని తరలిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం రంగంలోకి దిగిన సైన్యం ఉత్తర కాశీలో చిక్కుకున్న ఇద్దరు తెలుగు వారిని కాపాడిరది. విజయవాడకు చెందిన సుభద్ర, విశాఖకు చెందిన సురేఖగా గుర్తించారు. వారిని హెలీకాప్టర్‌లో డెహ్రాడూన్‌లోని హిమాలయ ఆస్పత్రికి తరలించారు. ఉత్తర కాశీ వరదల్లో చిక్కుకున్న 116 మందిలో 14 మందిని అధికారులు రక్షించారు. వారిని మందాకినీ హోటల్‌కు తరలించారు.
ఏపీ భవన్‌కు చేరిన యాత్రికులు
చారధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ యాత్రికులు పలువురు సురక్షితంగా ఢల్లీికి చేరుకున్నారు. సైన్యం సహాయంతో వరదల నుంచి బయటపడిన 150 మంది రాష్ట్ర వాసులు గురువారం ఉదయం ఢల్లీిలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ చిక్కుకుపోయి తాము అనుభవించిన అవస్థలను చెప్పుకొంటూ రోదించారు. ప్రాణాలతో బయటపడడం తమ అదృష్టమని పేర్కొన్నారు. మరోవైపు, వారిని ఢల్లీి నుంచి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ పరామర్శించారు. సైన్యం సహకారంతో రాష్టాన్రికి చెందిన 30 మంది యాత్రికులు గురువారం ఉదయం ఢల్లీిలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. ఢల్లీి పర్యటనలో ఉన్న డీఎస్‌ వారిని కలిసి పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన 400 మంది తమిళనాడు వాసులను కాపాడటానికి ప్రభుత్వం అన్ని బాధ్యతలను తీసుకుంటుందని ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి జయలలిత అన్నారు.  రాష్ట్రానికి చెందిన 399 మంది సురక్షితంగా ఉన్నారని తెలియజేశారు. ఈ విషయమై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్టు ఆమె తెలిపారు. పర్యాటకులను డెహ్రాడూన్‌ నుంచి తమిళనాడుకు సురక్షితంగా చేర్చడానికి ఒక ప్రతినిధిని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వారి ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆమె అన్నారు. ఇటీవలి వరదల్లో చిక్కుకున్న పలు రాష్ట్రాల యాత్రికులను సైన్యం హెలికాప్టర్ల సాయంత రక్షించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇందులో భాగంగా తెలుగువారిని న్యూఢల్లీిలోని ఎపి భవన్‌కు తరలించారు. తమిళనాడు యాత్రకులపై జయ ఆరా తీశారు. వారిని రక్షించి తీసుకు రావడానికి అన్ని చర్యలు తీసుకున్నారు.
వరదల్లో దేశ రాజధాని
భారీ వర్షాలు, వరదల ప్రభావం దేశ రాజధాని ఢల్లీిని వీడలేదు. యమున నది పోటెత్తడంతో ఢల్లీిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ స్థాయిలో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు చిక్కుకుపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు ఎదుర్కొన్నారు.