ఉత్తర కాశీలో విరిగిపడుతున్న కొండ చరియలు

చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
డెహ్రాడూన్‌, జూన్‌ 16 (జనంసాక్షి): ఉత్తర కాశీ అడవుల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వరదలు ముంచెత్తడంతో గంగోత్రి యాత్రకు వెళ్తున్న తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. గంగానది అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావానికి భూమి కోతకు గురై పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తరఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరకాశీ`హరిద్వార్‌ మధ్య ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 300 బస్సులను నిలిపి వేశారు. దీంతో మూడు రోజులుగా అన్నపానీయాలు అందక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. చిక్కుకుపోయిన వారు నెల్లూరు జిల్లాకు చెందిన 54 మంది, నల్గొండ జిల్లాకు చెందిన 10 కుటుంబాలు, అనంతపురం జిల్లా కదిరి ప్రాంతానికి 30 మంది, కృష్ణా, ఉభయగోదావరి, వాసులు ఉన్నట్లు సమాచారం.
ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మాట్లాడాం : రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర కాశీ అడవుల్లో ఆంధ్రా వాసులు చిక్కుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. భక్తుల పరిస్థితిపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మాట్లాడామని తెలిపింది. భక్తులను సుంక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ అధికారులు చెప్పారని తెలిపింది. స్థానికుల సాయంతో కొన్ని కొండ చరియలు తొలగించామని అధికారులు చెప్పారని తెలిపింది. వరదల కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి అడవుల్లో చిక్కుకుపోవడంతో అన్నపానీయాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నామని భక్తురాలు రాజ్యలక్ష్మి తదితరులు చెప్పారు. ఉత్తర కాశీకి 18 కిలోమీటర్ల దూరంలో తాము చిక్కుకున్నట్లు ఆమె చెప్పారు. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉందని, ఆంధ్రాకు చెందిన 300, మహారాష్ట్రకు చెందిన 200 బస్సులు ఆగిపోయాయని తెలిపారు.
సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
ఉత్తరకాశీ అడవుల్లో చిక్కుకున్న ఆంధ్రా భక్తుల సమాచారం కోసం ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. చిక్కుకున్న వారి సమాచారం తెలుసు కునేందుకు 013 742 261 26 నంబర్‌కు కాల్‌ చేయవచ్చు.