ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీచేయం

స్వామిగౌడ్‌కు మద్దతు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి):

ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే స్వామిగౌడ్‌పై పోటీ పెట్టరాదని నిర్ణ యించామని ఆయన చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో గౌడ్‌ కీలక పాత్ర పోషిస్తున్నందున ఆయనకు వ్యతిరేకంగా  అభ్యర్తిని నిలపరాదని నిర్ణయించామన్నారు. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించామన్నారు. ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి భాజపా మద్దతిస్తుందన్నారు. కృష్ణా- గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూపూడి రంగరాజు, ఖమ్మం- వరంగల్‌-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూతురు లక్ష్మారెడ్డిలను భాజపా ప్రకటించింది.అంతకుముందు  బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ- అయ్యారు. వారు కిషన్‌రెడ్డిని కలుసుకుని టీ-ఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వామిగౌడ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు కిషన్‌రెడ్డిని కలిశారు. స్వామిగౌడ్‌కు మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని, పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ బీజేపీ సీనియర్‌ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కూడా ఉన్నారు.