ఉద్యమాలతో సంబంధం లేని వారికి టికెట్లిస్తే?
రాజకీయాలు.. ఉద్యమాలు.. కలగలిసి ఉండేవి. ఉద్యమకారులే ఎన్నికల్లో పోటీ పడేవారు. ప్రజల పక్షాన పోరు సలిపిన వారే ఎన్నికల్లో విజయం సాధించేవారు. ఇదంతా గడిచిన చరిత్ర. ప్రస్తుతం రాజకీయాలంటేనే పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల తొత్తుగా మారాయి. బూర్జువా పార్టీలే కాదు, ఉద్యమ పార్టీల్లోనూ వారి ప్రాధాన్యం పెరిగిపోయింది. కమ్యూనిస్టులు ఈ విషయంలో కాస్త మెరుగనే చెప్పాలి. ఉద్యమంతో సంబంధం లేని వారికి టికెట్లు ఇచ్చేందుకు కమ్యూనిస్టులు ససేమిరా ఒప్పుకోరు. ఉద్యమ సంబంధ కుటుంబాల్లోని వారిని రాజకీయంగా ప్రోత్సహించవచ్చేమో కాని వారు కూడా విద్యార్థి, యువజన ఉద్యమాల్లో భాగస్వాములే. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి స్వతహాగా ఉద్యమపార్టీ. దశాబ్దానికిపైగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ రకాల ఉద్యమాలు సాగిస్తోంది. తెలంగాణ కోరుకునే వారితో కలిసి ఐక్య ఉద్యమాలూ సాగిస్తోంది. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఫక్తు బూర్జువా పార్టీల విధానాలను అనుసరిస్తోంది. ఉద్యమంతో సబంధంలేని వ్యక్తులకు పార్టీలో పెద్దపీఠ వేసి వారిని ప్రత్యక్ష ఎన్నికల గోథాలోకి దింపుతోంది. కొంతమందిని ఎన్నికల సమయంలోనే పార్టీలో చేర్చుకొని రాత్రికి రాత్రే వారికి కండువాలు కప్పి తెల్లారేసరికి బీఫాం చేతిలో పెట్టి పోటీకి దించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రంలో యూపీఏకు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో టీఆర్‌ఎస్ జట్టుకట్టింది. మహాకూటమిగా టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేశాయి. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్సే అత్యథిక స్థానాలు తీసుకుంది. పది ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపగా కేవలం ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. వారివురూ కూడా పార్టీ అధినేత కేసీఆర్, సినీనటి విజయశాంతి కావడం విశేషం. ఎంపీ స్థానాలకు పోటీ పడ్డవారిలో అత్యధికులు రాజకీయాలకే కొత్తవారు. ఏమాత్రం ప్రజాబలం లేనివారు. ప్రజాసంబంధాలు అసలే లేనివారు. వారిలో హెచ్చుమంది పెట్టుబడిదారులో, వారికి అత్యంత సన్నిహితులో. అలాంటి వారికి టికెట్లిస్తే ఖర్చుల కాడ వెనుకాడరు అనే భావన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లో కనిపించింది. అంతకుమించి తాను ఎవరికి టికెట్ ఇస్తే ప్రజలు చచ్చినట్టు వారికే ఓటు వేస్తారనే అతివిశ్వాసం కనిపించింది. ఆ అతివిశ్వాసానికి ఫలితమే ఎన్నికల్లో ఘోర పరాజయం. టీఆర్‌ఎస్ పార్టీగా ఉద్యమిస్తే సరిపోతుందనే భావన కేసీఆర్‌కు కల్పించింది తెలంగాణ ప్రజలే. అంతకుపూర్వం ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా తెలంగాణవాదం కోసమంటూ ఓట్లేసి గెలిపించడమే తప్పన్నట్టుగా 2009 ఎన్నికల సమయంలో కేసీఆర్ వ్యహరించాడు. ఫలితంగానే ఎవరికి పడితే వారికి టికెట్ ఇచ్చాడు. దానికి ప్రతిఫలమూ అనుభవించాడు. అంతక్రితం కేసీఆర్ పంపిన ప్రతి అభ్యర్థికి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఈసారి మాత్రం భిన్నంగానే స్పందించారు. ఎంపీలే కాదు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులోనూ టీఆర్‌ఎస్ నేత అహం ప్రస్ఫుటంగా కనిపించింది. నేను చెప్పినవాడే ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహరించాడు. ప్రజలు దానికి కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు. నీవు చెప్పిన వారు కాదు మేం ఓట్లేసిన వారే ఎమ్మెల్యే అన్ని ఈవీఎం మీటా నొక్కి మరీ చెప్పారు. 2004 ఎన్నికలతో పోలిస్తే 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చావు దెబ్బతిందని ఆ పార్టీ వర్గాలే ఒప్పుకున్నాయి. ప్రజలతో సంబంధంలేని వ్యక్తులు, ఉద్యమంలో భాగస్వాములు కాని వ్యక్తులను ఉద్యమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు తేల్చిచెప్పారు. అయినా టీఆర్‌ఎస్ వ్యవహార శైలిలో పెద్దగా మార్పురాలేదు. 2009లో ప్రజల వద్దే కోల్పోయింది మళ్లీ వారి దగ్గరే పొందాలని కేసీఆర్ ఫక్తు ఎన్నికల ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. 2014లోపు తెలంగాణ రాదని, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదని తేల్చిచెబుతూ తమ పార్టీకి 15 ఎంపీ స్థానాలు, వంద ఎమ్మెల్యే స్థానాలు కట్టబెడితే తప్ప మీ ఆకాంక్ష నెరవేరబోదంటూ బంతిని ప్రజల కోర్టులోకి నెట్టేశాడు. ఆయన ఇక్కడ గుర్తించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చిన వారిలో గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), బాలరాజు (నాగర్‌కర్నూల్) తర్వాతికాలంలో ఎక్కడా ఉద్యమంలో కనిపించలేదు. వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి, పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించిన రామగళ్ల పరమేశ్వర్ కాస్త పరవాలేదనిపించినా మిగతా వారితో ఆయన కాస్త తక్కువగానే కనిపించారు. ఇలాంటి వారిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించి ఓట్లేయమని ప్రజలను ఒత్తిడి తెస్తే ఫలితం ఉండబోదు. ఉద్యమ పార్టీ ఉద్యమ నేతలనే అభ్యర్థులుగా ప్రకటించాలి. అంతకంటే ముందే ఢిల్లీ పీఠం కదిలించే స్థాయిలో ప్రజా ఉద్యమాలు నడపాలి.