ఉద్యమ నేతపై విషం

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ సారథ్యం వహిస్తున్న టీ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు విషంకక్కాడు. అంబేద్కర్‌ జయంతి ఇందుకు వేదిక కావడం విచాకరం. అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన టీడీపీ నేతలు తెలంగాణపై అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణవాదులు ప్రశ్నించారు. దీంతో శివాలెత్తిన మోత్కుపల్లి కోదండరామ్‌పై ఆరోపణలు గుప్పించాడు. నెలకు లక్ష జీతం తీసుకుంటూ ఒక్క విద్యార్థికి చదువు చెప్పడం లేదంటూ అచ్చూ సీమాంధ్ర నేతల్లానే నిలదీశాడు. టీడీపీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు కాబట్టే ప్రజలు ఆ పార్టీని అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు. కోదండరామ్‌ టీ జేఏసీకి కన్వీనర్‌గా ఉన్నాడు కాబట్టి వివిధ వర్గాల ప్రజలు టీ జేఏసీ జెండా కిందనే ప్రత్యేక పోరులో పాలుపంచుకుంటున్నారు. ఈ పోరాటంలో టీడీపీ ఎక్కడా కానరాని పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ పాత్రపై ప్రజలకెన్నో సందేహాలున్నాయి. అందుకు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే కారణం తప్ప, టీ జేఏసీయో, కోదండరామో కాదు. తాము తెలంగాణకు అనుకూలంగా లేక ఇచ్చినా, తీర్మానాలు చేసినా.. తమ పార్టీనే టార్గెట్‌ చేస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. ప్రజలు కూడా టీడీపీ చేస్తున్న ఆరోపణలోంచే ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీ మహానాడులోనూ తెలంగాణకు అనుకూలమని చెప్పింది. యూపీఏ-1 ప్రభుత్వంపై తెలంగాణపై ఏర్పాటు చేసిన కమిటీకి అనుకూలంగా లేఖ ఇచ్చామని చెప్పింది. కానీ ఆ లేఖలో ఏముందో ఇంత వరకూ బయటపెట్టలేదు. 2009లో తెలంగాణలోని పది జిల్లాల ప్రజలు ఏకమై పోరుబాట పట్టడంతో నిండుశాసన సభలో అధికార కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టకపోతే తామే ప్రైవేటు తీర్మానం తెస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రాణాలు రక్షించడం ఎంతో ముఖ్యమని, అధికారపార్టీ తెలంగాణపై తీసుకునే నిర్ణయానికి తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. 2009 డిసెంబర్‌ 6న అసెంబ్లీలో టీడీపీ చేసిన వ్యాఖ్యలు, మరుసటి రోజు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో నిర్వహించిన ఆల్‌పార్టీ మీటింగ్‌లో టీడీపీ వెలుబుచ్చిన అభిప్రాయాల ఆధారంగానే యూపీఏ-2 ప్రభుత్వం డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రజలు ఆ సంబరం నుంచి పూర్తిగా తేరుకోకముందే అప్పటివరకూ తెలంగాణకు అనుకూలమని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా తిరిగాడు. ఒక రాష్ట్రాన్ని విడదీయాలనే నిర్ణయం అర్ధరాత్రి ఎలా ప్రకటిస్తారని? అసలు ఎవరినడిగి ప్రకటన చేశారని? చిన్నపిల్లాడిలా ప్రశ్నించారు. అంతకుముందు రాష్ట్ర శాసనసభలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తానేం చెప్పానో విస్మరించి సమైక్యవాదాన్ని ఎజెండాగా ఎత్తుకున్నారు. టీడీపీతో పాటు అధికారపార్టీలోని సొంతవర్గం నేతలతో బూటకపు రాజీనామాలకు, దొంగదీక్షలకు తెరతీయించారు. దాని ఫలితంగా పెట్టుబడిదారి వర్గం పెట్రేగిపోయింది. ఇందుకు కారకుడే చంద్రబాబునాయుడు, టీడీపీ. ఆ పార్టీ తర్వాతికాలంలో అందుకు తగిన మూల్యమే చెల్లించుకుంది. అయినా పెట్టుబడిదారి శక్తుల చేతుల్లో బందీలైన టీడీపీ నేతలు ఉద్యమానికి వ్యతిరేకంగానే పనిచేశారు. పార్టీ తీర్మానాన్ని తుంగలో తొక్కేశారు. ఒక్కరోజు కూడా ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేసేలా ఉద్యమంలో పాల్గొనలేదు. పైపెచ్చు తెలంగాణ ప్రజలను జేఏసీనే తమపైకి ఉసిగొల్పుతోందని అక్కసు పెంచుకుంది. అదే అక్కసు మోత్కుపల్లి బాహాటంగా ప్రదర్శించారు. సీమాంధ్ర నేతలకు డూప్‌లా ప్రవర్తించాడు. ఇలాంటి వారిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరంలో లేదు. 2014 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఉద్యమ ద్రోహులకు.. ఉద్యమ నేతలను అసహాస్యం చేసే వారికి ప్రజలు గుణపాఠం చెప్పేరోజు ముంచుకొస్తుంది.