ఉద్యమ నేతలపై సీబీఐ విచారణ జరపాలట!

రఘునందన్‌ అక్కసు
హైదరాబాద్‌, మే 21 (జనంసాక్షి) :
తెలంగాణ ఉద్యమ నేతలపై సీబీఐ విచారణ జరపా లంటూ టీఆర్‌ఎస్‌ బహి ష్కృత నేత రఘునందన్‌ రావు విష ప్రచారం మొద లు పెట్టాడు. టీఆర్‌ఎస్‌ నుంచి తనను వెలి వేశారనే అక్కసుతో మొత్తం ఉద్యమా న్నే అభాసు పాలు చేసే ప్రయత్నం ప్రారంభించాడు. టీిఆర్‌ఎస్‌ నేతలు పలువురు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించాడు. మంగళవారం కోఠిలోని సిబిఐ కార్యాలయంలో జెడి లక్ష్మీనారాయణను కలిశాడు. అనంతరం వెలుపలకు వచ్చిన రఘునందన్‌ మీడియాతో మాట్లాడారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ వారిపై చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ప్రాథమిక సమాచారాన్ని సిబిఐ జెడి లక్ష్మీనారాయణకు అందజేశానన్నారు. టిఆర్‌ఎస్‌కు సంబంధించిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ అనే వ్యక్తి నుంచి టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌, ఎమ్మెల్యే హరిష్‌రావు అక్రమవసూళ్లకు పాల్పడ్డారన్న దానిపై కూడా ఫిర్యాదు చేశానన్నారు. సిబిఐ కస్టడీలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ను, స్టయిలిష్‌ హోం రంగారావును విచారిస్తే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని లక్ష్మీనారాయణకు చెప్పానన్నారు. పద్మాలయ భూముల విషయంలో దాదాపు 80 లక్షల రూపాయల వరకు హరీష్‌రావు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించానని అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామని జెడి లక్ష్మీనారాయణ అన్నారన్నారు. అందుబాటులోనే ఉండాలని సూచించారని అన్నారు.