ఉద్యాన పంటలకు రాయితీలు
నిజామాబాద్,మే30(జనంసాక్షి): రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రైతులకు సాయం అందివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. బిందు సేద్యంపై ఆసక్తి తక్కువ ఉందని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. బిందుసేద్యానికి ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం రాయితీ, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో మరెక్కడ లేనివిధంగా తెలంగాణలో పాలీహౌజ్ సేద్యానికి అత్యధికంగా రాయితీలు ఇచ్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. రైతులను లాభాల దిశలో తీసుకెళ్లడానికి అవసరమైన పండ్ల తోటలు, కూరగాయల సాగుకు గణనీయంగా రాయితీలు ఇస్తుందన్నారు. రైతులను ఉద్యానవన పంటల వైపు మొగ్గుచూపాలని ఆ దిశగా యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారని పేర్కొన్నారు. పండ్లతోటల సాగుకు రైతులను ప్రోత్సహించడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. 40 లక్షల గొర్రెలకు పశుగ్రాసం విత్తనాలు అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. గొర్రెల పెంపకంతో ఎరువు ద్వారా పంటలు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశముందన్నారు. గొర్రెల పెంపకందారులు దరఖాస్తు చేసుకొని గడ్డి విత్తనాలు పొందలన్నారు.