ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక
నిజామాబాద్,ఫిబ్రవరి7(జనంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. గ్రామ పంచాయతీల్లో ఉపాధి కూలీలకు అదనపు పని దినాలను కల్పించాలని డీఆర్డీవో అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ మేరకు గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ఏ మేరకు పనులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో ఉపాధిహావిూ పథకం పేద ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెరువుల్లో పూడికతీత, పశువుల పాకలు, గొర్రెల పాకలు, పాఠశాలల్లో వంటశాలలు, అంతర్గత రోడ్ల నిర్మాణం, నీటి గుంటలను నిర్మించనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యతీసుకుంటున్నారు. వీటితో పాటు జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ బావుల తవ్వకం, నీటి గుంటల నిర్మాణం, ఫాంపండ్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, లాండ్ లెవలింగ్, పండ్ల తోటల పెంపకం, టేకు, సీతాఫలం మొక్కల పెంపంకం లాంటి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా గ్రావిూణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరులు ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంపిక చేసి కూలీలకు పని కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తారు. ప్రతీ సంవత్సరం కూలీల బడ్జెట్ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధి కల్పనకు, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి కూలీలకు ఉపాధి కల్పిస్తారు. దీనికితోడు జిల్లాలో ఈ సారి గిరిజన ప్రాంతాల్లోని ఉపాధిహావిూ పనులకు అధికారులు పెద్దపీట వేశారు. దీంతో ఆయా మండలాల్లోని గిరిజనులకు ఏడాదికాలం పాటు ఈ పథకంలో వివిధ రకాల పనులతో వారు తమ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునే అవకాశం లభించింది. జిల్లాలో ఎక్కువగా వానాకాలం పంటలు మాత్రమే సాగవడంతో రైతులు, వ్యవసాయ కూలీలకు పనిలేకుండా పోతుంది. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం అంతంత మాత్రంగానే ఉండడంతో ఇక్కడి ప్రజలకు సైతం పనిలేకుండా గతంలో పని లభించేది కాదు. జిల్లాలో జాతీయ ఉపాధిహావిూ పథకం అమలవుతున్నప్పటి నుంచి అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఆ సంవత్సరం పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామాల్లో ఉపాధి పనులకు డిమాండ్ ఉండడంతో చాలా గ్రామాల్లోని కూలీలు వంద రోజుల కూలీని పూర్తి చేస్తున్నారు.