ఉపాధి కూలీలకు ఎండాకాలం రక్షణ
పని క్షేత్రాల్లో మంచినీటి సౌకర్యం
నిజామాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): జిల్లాలో వేసవిలో ఎక్కువ మంది కూలీలు ఉపాధిహావిూ పనులకు
హాజరయ్యేలా డీఆర్‌డీవో అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మరోవైపు ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో కూలీలు పనిచేసే ప్రాంతాల్లో వసతులు కల్పిస్తున్నారు. నీడతో పాటు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామసభల్లో గుర్తించిన పనులను చేపడుతూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలు ముగియడంతో నెల రోజులుగా గ్రామాల్లో ఉపాధి హావిూ పనులకు వచ్చే కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజు 50 వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. ఉపాధిహావిూ పథకంలో భాగంగా నీటిగుంటలు, ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం, కందకాలు, చెక్‌డ్యాం కాలువల్లో పూడికతీత పనులు ఊటకుంటలు, టేకు నర్సరీలు, కిచెన్ షెడ్‌లు, గడ్డి పెంపకం, పశువుల నీటి తొట్టెలు, పండ్లతోటల పెంపకం, డంపిగ్‌యార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం, నీటి నిల్వలకు సంబంధించిన పనులు, ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల నిర్మాణాలను చేపడుతారు.కూలీల సంఖ్యను మరింత పెంచేందుకు ఎంపీడీవోలు, ఉపాధిహావిూ ఏపీవోలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ ముగిసే నాటికి కూలీలకు 30 లక్షల పనిరోజులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను
ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ పనులను పర్యవేక్షిస్తాయి. జూన్‌నాటికి నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హావిూ పథకం కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. వేసవిలో గ్రామాల్లోని పేదలు వ్యవసాయ కూలీలు పనులు లేకపోవడంతో ఎక్కువ మంది ఉపాధిహావిూ పనులపై ఆధారపడుతున్నారు. ప్రతి సంవత్సరం కూలీల బడ్జెట్ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధుల బలోపేతానికి, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతులు కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి కూలీలకు ఉపాధి కల్పిస్తా రు. జిల్లాలో పనిదినాలు సైతం ఎక్కువగా ఉండడంతో కూలీలకు పుష్కలంగా ఉపాధి లభిస్తోంది.