ఉపాధి హామీ విజయవంతం

కరువు జిల్లాల్లో వలసలు తగ్గాయి : జైరాం రమేశ్‌
అనంతపురం, జూన్‌ 16 (జనంసాక్షి) :
ఉపాధి హామీ పథకం విజయవంతమైందని, ఈ పథకం వల్ల కరువు జిల్లాలో వలసలు తగ్గాయని కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ అన్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆయన ఆదివారం పర్యటించారు. కల్యాణదుర్గంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద కరువు జిల్లాల్లో 150 పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. ఉపాధి హామీ వల్లే కొన్ని జిల్లాల్లో వలసలు తగ్గాయని అన్నారు. కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి గాను 145 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో మొత్తం మీద నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు 82 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాలు ఉన్నాయన్నారు. నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో రోడ్లు నిర్మాణానికి, రోడ్ల పునర్నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా ఎంతగానో మెరుగయ్యాయని పేర్కొన్నారు.