ఉపాధ్యాయునిపై కత్తితో దాడి
జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు కుటుంబ సభ్యులు, బందువులు తెలిపారు. వారి కథనం ప్రకారం… జమ్మికుంట మండలం మాచనపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి గడ్డివానిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ హౌజింగ్‌బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆయన సురేందర్‌రావుకు అప్పుగా రూ.13లక్షలు ఇచ్చారు. ఇందులో రూ.6లక్షలు తిరిగి చెల్లించిన సురేందర్‌రావు మిగతా డబ్బుల విషయం తేల్చకపోవడంతో ఇరువురి మధ్య గొడవ జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా వ్యవహారం కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో సురేందర్‌రావు ఫోన్‌చేసి డబ్బు చెల్లిస్తానని చెప్పడంతో వెంకటరెడ్డి గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌కు వెళ్లారు. ఇద్దరూ జూబ్లీ బస్టాండు సమీపంలో కలుసుకున్నారు. డబ్బు విషయమై వాగ్వాదం జరగ్గా సురేందర్‌రావు తనవెంట తెచ్చుకున్న కత్తితో వెంకట్‌రెడ్డి కడుపులో పొడిచాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108సిబ్బంది క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారని మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ శశాంక్‌రెడ్డి తెలిపారు. వెంకట్‌రెడ్డి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేశామని, సురేందర్‌రావు పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.