ఉప్పూ, పప్పు నిత్యావసరాలు రూ.185కే ఉగాది కానుక : సీఎం

క్షణాల్లో మీ డబ్బు మీ చేతికి : జైరాంరమేష్‌
తిరుమల, మార్చి 30 (జనంసాక్షి):
రాష్ట్ర ప్రజలకు శుభవార్త! 185 రూపాయలకే తొమ్మిది నిత్యావసర వస్తువులు.. ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభం.. అని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించారు.  కందిపప్పు, పామోలిన్‌, గోధుమలు, గోధుమపిండి, చక్కెర, ఉప్పు, కారం, చింతపండు, పసుపులను అందించ నున్నట్టు తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆధార్‌ ఆధారితతో నగదు బదిలీ పథకాన్ని కేంద్ర మంత్రి జైరాం రమేష్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగలో సభలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు జైరాం రమేష్‌, కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, గల్లా అరుణ, కె.పార్ధసారధి, చిత్తూరు ఎంపి ఎన్‌.శివప్రసాద్‌, తదితరులు ప్రసంగించారు. కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి తిరుపతి ఎంపి చింతామోహన్‌ అనువదించారు. ముఖ్యమంత్రి  మాట్లాడుతూ తొమ్మిది నిత్యావసర వస్తువులను 185 రూపాయలకే అందించడం వల్ల ప్రభుత్వంపై 660 కోట్ల రూపాయల మేర భారం పడుతుందన్నారు. మహిళలకు మరింత మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు.ఈ పధకాన్ని ఏప్రిల్‌ 11న హైదరాబాద్‌లో ప్రారంభిం చనున్నట్టు, అదే నెల 15వ తేదీ నుంచి 24వ తేదీలోగా అన్ని మండలాల్లోని వారికి అందించనున్నట్టు తెలిపారు. ఏడాది పొడవునాఈ పథకం కొనసాగుతుందన్నారు. మహిళలు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ ఏడాది జూన్‌ నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు తెలిపారు. కేంద్రప్రభుత్వం కూడా 33శాతం ఉన్న మహిళల రిజర్వేషన్‌ను 50శాతానికి పెంచే అవకాశం ఉందని అన్నారు. ఎంపిటిసి, జడ్‌పిటిసి, మునిసిపల్‌ ఎన్నికల్లోను మహిళలకు అధిక సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. అంతేగాక మొన్న మెదక్‌ జిల్లాలో మహిళల ఇండస్ట్రియల్‌ పార్కును ఏర్పాటు చేశామని, అదేవిధంగా అన్ని జిల్లాల్లోను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లాలోని మహిళలు కూడా పారిశ్రామికవాడను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.  పారిశ్రామికవాడ వల్ల దాదాపుగా 190 పరిశ్రమలు ఏర్పాటవుతాయని, సుమారు 12వేల మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికిగాను ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రుణాలు తీసుకున్న మహిళా స్వయం సహాయక సంఘాల్లో 98శాతం సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నాయన్నారు. ఇది హర్షించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వారు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుతున్నామన్నారు. దేశంలో తొలిసారిగా చిత్తూరు జిల్లాలో ఆధార్‌ ఆధారిత నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం హర్షదాయకమన్నారు. పోస్టాఫీసుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనుండడం ఆనందదాయకమన్నారు. అన్ని రకాల పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, ఉపాధి హామీ పధకం నగదు, రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బియ్యం కూడా అందించనున్నట్టు తెలిపారు. వేలి ముద్ర ద్వారా తమ ఇళ్ల వద్దే ఉండి నగదును పొందొచ్చన్నారు. అంతేగాక ఈ పద్ధతి వల్ల అర్హులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దళారీ వ్యవస్థ కనుమరుగు కావడం ఖాయమన్నారు. శ్రీకాకుళం వారు హైదరాబాద్‌లో పొందవచ్చన్నారు. హైదరాబాద్‌ వారు విశాఖపట్నంలో పొందొచ్చని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 10,917 కుగ్రామాలున్నాయన్నారు. రెండు దశల కింద కండలేరు నీటిని చిత్తూరు జిల్లా ప్రజలకు అందించనున్నట్టు తెలిపారు. తొలి దశకు గాను 5,990 కోట్ల రూపాయలు, రెండో దశ కింద 1400 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఈ ప్రాజెక్టు రెండు, మూడు ఏళ్లల్లో పూర్తవుతుందన్నారు. కండలేరు నుంచి తాగునీటిని జిల్లా ప్రజలకు త్వరితగతిన అందించేందుకు  అందించేందుకు కృషి చేస్తానన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎస్‌సి,ఎస్‌టిలకు ఈ ఏడాది బడ్జెట్‌లో 10,500 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. వారి కోసం కేటాయించిన సొమ్మును వారికే ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే బీసీ సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశామన్నారు. బీసీ సంక్షేమానికి ఈ ఏడాది బడ్జెట్‌లో 4,027 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. వాకింగ్‌ ఫ్రెండ్‌ తన హయాంలో బీసీలకు ఎంతో చేశానని చెప్పుకుంటున్నారని, ఆ సమయంలోని రికార్డులను పరిశీలిస్తే తొమ్మిదేళ్లల్లో బీసీ సంక్షేమానికి ఆయన కేటాయించింది మొత్తం 1580 కోట్ల రూపాయలేనన్నారు. బీసీ సంక్షేమం కోసం ఎవరు పాటు పడుతున్నారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. అలాగే మైనారిటీల కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నామన్నారు.  ఈ ఏడాది బడ్జెట్‌లో 1,028 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలసంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ఘనత తమ పార్టీకే చెందుతుందని అన్నారు.  చిత్తూరు ఆసుపత్రికి నిధులు కావాలన్న ఎంపి శివప్రసాద్‌ విజ్ఞప్తి మేరకు 10 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నానన్నారు. అలాగే మంత్రి గల్లా అరుణ ప్రతిపాదించిన వాటికి కూడా ఆమోదముద్ర వేస్తున్నట్టు ప్రకటించారు.

‘మీ డబ్బు.. మీ చేతికే..’ అభినందనీయం : జైరాంరమేష్‌

మీ డబ్బు.. మీ చేతికే పథకాన్ని తొలిసారిగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రారంభించడం అభినందనీయమని కేంద్ర మంత్రి జైరాంరమేష్‌ అన్నారు. పెన్షన్‌, స్కాలర్‌షిప్‌, ఉపాధి హామీ పథకం నగదు కోసం మహిళలు బ్యాంకులు, పోస్టాఫీసులు చుట్టూ తిరగనవసరం లేదని అన్నారు. వారే లబ్ధిదారుల చుట్టూ తిరుగుతారని అన్నారు. మరో వంద రోజుల్లో మరో ఆరు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. నిజామాబాద్‌, నల్గొండ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, అదిలాబాద్‌ జిల్లాల్లో ప్రారంభించనున్నట్టు వెల్లడిం చారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరింపజేయనున్నట్టు తెలిపారు. సెల్‌ఫోనును పోలిన మిషన్‌ ఒకటి ఉంటుందని, దానిపై వేలిముద్ర వేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేయగానే 22 సెకన్లలో మీ డబ్బు మీ చేతికే అందుతుందన్నారు. వేలిముద్ర, ఆధార్‌ నంబరు నొక్కగానే.. ఆ వర్తమానం చంద్రగిరి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి.. వెంటనే చంద్రగిరికి నగదు చేరుతుందన్నారు.  వితంతు, వికలాంగ, వృద్ధుల పెన్షన్లు అందజేస్తామన్నారు. చిత్తూరుజిల్లాలో 1000కి పైగా పోస్టాఫీసు కార్యా లయాలున్నాయని, వారందరూ మీ చెంతకే వచ్చి సేవలందిస్తారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.

పోస్టాఫీసు ద్వారా సేవలు : కిల్లి కృపారాణి

ఆధార్‌ ఆథారిత నగదు బదిలీ పథకాన్ని పోస్టాఫీసుల ద్వారా లబ్ధిదారులకు అందజేయడం హర్షదాయక మని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. దీంతో దళారీ వ్యవస్థ రూపుమాసిపోతుందన్నారు. చిత్తూరు జిల్లాలో 20 మండలాల్లో ఆధార్‌ ఆధారంగా పెన్షన్లు, స్కాలర్‌షిప్‌లు, తదితరాలు అందించనున్నట్టు వెల్ల డించారు. నెల రోజుల్లో 68 మండలాల్లో పోస్టాఫీసుల ద్వారా అందిస్తామన్నారు. మరో ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఏడాదిలోగా దేశమంతటా అమలు చేయనున్నట్టు తెలిపారు.  ఏడాది తర్వాతే ఆ సేవలను బ్యాంకుల ద్వారా కూడా అందించనున్నట్టు చెప్పారు. స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 15వేల నుంచి 20వేల రూపాయల వరకు రుణాలు అందించడం అభినందనీయమన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అక్టోబరులో నెలకొల్పనున్న మహిళా బ్యాంకు కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటయ్యేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి జైరాంరమేష్‌, సీఎం కిరణ్‌లకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

ఇదొక అద్భుతం : సునీతాలక్ష్మారెడ్డి

ఆధార్‌ ఆధారిత నగదు బదిలీ పథకాన్ని తొలిసారిగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రారంభించడం అద్భుతమైన విషయమని రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లాలో మరిన్ని పాల ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మహిళల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నానన్నారు. రాజకీయంగా ఎదిగేందుకు 50శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయతీ ఎన్నికల నుంచి అమలు చేయనుండడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా మహిళలు ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.