ఉప ఎన్నిక‌ల్లో వాడిన క‌మ‌లం


దిల్లీ: దేశవ్యాప్తంగా  ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక చోట మిన‌హా బీజెపి ప‌రాజ‌యం పాల‌యింది. 2019 ఎన్నిక‌ల‌కు ఉదాహ‌ర‌ణ‌కు నిపుణులు విశ్లేషిస్తున్నారు.కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మునిరతన్‌ భాజపా అభ్యర్థి మునిరాజు గౌడపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో సీటు దక్కింది. మునిరతన్‌ 41వేల ఓట్ల మెజార్టీ సాధించారు.మేఘాలయలోని అంపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మియాని డి శిరా విజయం సాధించారు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థిపై 3,100సీట్ల మెజార్టీతో గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ముకుల్‌ సంగ్మా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలవడంతో అంపతి స్థానాన్ని ఖాళీ చేశారు. దీంతో ఈ స్థానం నుంచి సంగ్మా కుమార్తె మియాని శిరా పోటీ చేసి గెలుపొందారు.
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. జోకిహట్‌ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడీ) అభ్యర్థి విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థికి 76వేల ఓట్లు పోలవగా, జేడీయూ అభ్యర్థికి 37,913ఓట్లు పోలయ్యాయి. జోకిహట్‌ నియోజకవర్గంలో జేడీయూ, ఆర్జేడీల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుగా నిలవగా ఇందులో ఆర్జేడీ బలాన్ని చాటుకుంది.ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌ వాదీ పార్టీ విజయం సాధించింది. ఎస్పీ అభ్యర్థి నయీముల్‌ హసన్‌ ప్రత్యర్థి భాజపా అభ్యర్థి అవనీష్‌ సింగ్‌పై సుమారు 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నూర్‌పూర్‌లో భాజపా సిట్టింగ్‌ ఎమ్మెల్యే లోకేంద్ర ప్రతాప్‌ సింగ్‌ మరణంతో ఈ సీటు ఖాళీ అయ్యింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.కేరళలోని చెన్‌గన్నూర్‌ శాసనసభ నియోజకవర్గంలో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించింది. ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సాజి చెరియన్‌ 20,956ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు.ఝార్ఖండ్‌లోని సిల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీ అభ్యర్థి సీమా దేవి మహతో విజయం సాధించారు. ఏజేఎస్‌యూ అభ్యర్థిపై దాదాపు 13500ఓట్ల మెజార్టీతో ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే గోమియా అసెంబ్లీ స్థానాన్ని కూడా జేఎంఎం పార్టీనే దక్కించుకుంది. జేఎంఎం అభ్యర్థి బబితా దేవి సమీప ప్రత్యర్థి అయిన భాజపా అభ్యర్థి మాఘవ్‌లాల్‌ సింగ్‌పై 1344 ఓట్ల తేడాతో గెలుపొందారు.