.ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్, బీజేడీ డుమ్మా
హైదరాబాద్,భువనేశ్వర్(జనంసాక్షి):ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున ఈ పోలింగ్‌కు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఉపరాష్ట్రపతి పోలింగ్ మంగళవారం జరగనుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీపడుతుండగా.. విపక్ష కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్నారు.ఉప రాష్ట్రపతి ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ప్రకటించగా.. తాజాగా ఒడిశాలోని ప్రధాన ప్రతిపక్షపార్టీ బిజూ జనతాదళ్ సైతం అదే వైఖరిని అవలంబిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌లో తమ పార్టీ ఎంపీలు దూరంగా ఉంటారని బీజేడీ రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్రా దిల్లీలో వెల్లడిరచారు. పార్టీ ఎంపీలు, రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)తో సంప్రదింపుల అనంతరం బీజేడీ అధినేత, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్లీలో ప్రకటించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలకు తమ పార్టీ సమాన దూరం కొనసాగించాలనే విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ దృష్టి అంతా రాష్ట్రాభివృద్ధి, 4.5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతిపైనేనని పాత్రా స్పష్టం చేశారు. బిజూ జనతాదళ్‌కు రాజ్యసభలో ఏడుగురు ఎంపీలున్నారు. ఉపరాష్ట్రపతి పోలింగ్ మంగళవారం జరగనుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీపడుతుండగా.. విపక్ష కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.