ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్‌లో కొత్త కాపులు

పొత్తులు తేలితేనే మిగతా సీట్లు ఖరారు
ఖమ్మం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పడటం.. భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ సైతం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రభావిత పార్టీలుగా ఉండగా.. ఆయా నియోజక వర్గాల నుంచి కాంగ్రెస్‌ ఆశావహులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కూటమి కారణంగా గెలుపు అవకాశాలుఎ పెరగియాన్న భావనలో ప్రతి ఒక్కరూ పోటీకి ముందుకు వస్తున్నారని  జిల్లా  రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల కోసం గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీపై పట్టున్న నేతలకు టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు పదుల సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అనేక మంది ఇప్పటికే వివిధ పార్టీలకు వలస వెళ్లడంతో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే యూనిస్‌ సుల్తాన్‌,
2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించిన  పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో ఖమ్మం నియోజకవర్గంలో కొత్త అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తుండగా.. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్‌ నేత మానుకొండ రాధాకిషోర్‌ తదితరులు టికెట్‌ కోసం దరఖాస్తు చేశారు. ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహులందరూ దాదాపు ఆ పార్టీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారే కావడం విశేషం. ఇల్లెందులో  కోరం కనకయ్య 2014లో విజయం సాధించి.. అనంతరం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తున్న వారిలో 15 మంది ఉన్నారు. అయితే ఈసారి అక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న కాంగ్రెస్‌ నేతలు వివిధ పార్టీల నుంచి అదే నియోజకవర్గం నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అనుభవం మాత్రం ఉండటంతో దానినే అదనపు అర్హతగా చూపిస్తూ టికెట్‌ కోసం అధిష్టానం వద్ద ప్రయత్నం చేస్తున్నారు. 2009లో పినపాక నియోజకవర్గం ఆవిర్భవించాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు విజయం సాధించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశిస్తున్న రేగా కాంతారావు ఈసా రి తనకే టికెట్‌ ఇవ్వాలని అధిష్టానం వద్ద భారీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే నియోజకవర్గం నుంచి అజ్మీరా శాంతి టికెట్‌ ఆశిస్తున్నారు.  టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి పోటీ చేసేందుకు ప్రచారం సైతం ప్రారంభించారు. ఆయన మినహా కాంగ్రెస్‌లో వరుసగా రెండుసార్లు గెలిచి.. మూడోసారి టికెట్‌ ఆశిస్తున్న
వారు జిల్లాలో లేకపోవడం విశేషం. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంభాని చంద్రశేఖర్‌ 2004 వరకు పాలేరు నుంచి పలుసార్లు కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సంభాని ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు జనరల్‌ స్థానంగా మారింది.  ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు లేకపోవడంతో జిల్లాలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలందరికీ టికెట్ల కేటాయింపునకు పార్టీ విధించిన నిబంధనలు అడ్డుపడే అవకాశం లేదని భావిస్తున్నారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న వనమా వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షుడి ¬దాలో ఉన్నా పార్టీ టికెట్‌ తనకు నిరాకరించడంతో వైఎస్సార్‌ సీపీలో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు.  ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వనమా మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరి.. ఈ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నారు.