ఉమ్మడి జిల్లాలో ప్రముఖులంతా ఇక్కడే పోటీ
అధికార బిఆర్‌ఎస్ నుంచి ముగ్గురు మంత్రులు
బిజెపి నుంచి ఇద్దరు ఎంపిలు..ఒక ఎమ్మెల్యే
కరీంనగర్,నవంబర్13 (జనంసాక్షి): రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. దానికి కారణం ప్రధాన పార్టీల ముఖ్య నాయకులు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల
నుంచి శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీల్లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు,మంత్రులు ఇక్కడి నుంచే పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపిలు, ఒక మాజీ ఎంపి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికలో, పార్టీ నిర్ణయాల్లో వీరి పాత్ర ఉంది. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల తరఫున వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరఫున అన్ని తానై వ్యవహరి స్తున్నారు. జిల్లాల్లో సభలు నిర్వహించి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు పరిచిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట అనేక నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల నామపత్రాల దాఖలు కార్యక్రమాల్లో ఏర్పాటు చేస్తున్న రోడ్‌షోల్లో కూడా పాల్గొన్నారు. భాజపాకు సంబంధించి రాష్ట్రంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి ఈటల రాజేందర్ ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో, పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ బరిలో నిలవడంతోపాటు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. పార్టీ క్యాంపెయినర్‌గా పలు జిల్లాల నియోజకవర్గాల్లో పార్టీ పక్షాన ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చారనే పేరుంది. ప్రస్తుతం పార్టీ క్యాంపెయినర్‌గా, కరీంనగర్ అభ్యర్థిగా నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల్లో పార్టీ ప్రచార సభల్లో పాల్గొని అభ్యర్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ వీరిద్దరికి పార్టీ అధిష్ఠానం హెలికాప్టర్ కేటాయించింది. ఇకపోతే మంత్రులు గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి, కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నుంచి
హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ పోటీలో ఉన్నారు. బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ కూడా కోరుట్ల బరిలో నిలిచారు. దీంతో ఉమ్మడి జిల్లా ప్రముఖుల జాబితాలో చేరింది. ఇకపోతే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం ఓటర్లే కీలకం కానున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీలు కూడా వారి ఓట్లపైనే ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో మున్నూరు కాపు నేతలనే తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఒకప్పుడు వెలమల ఇలాఖాగా పేరొందిన కరీంనగర్‌లో మున్నూరు కాపుల రాజకీయ ప్రాబల్యం పెరగడంతో ప్రధాన పార్టీలు కూడా వారికే ప్రాధాన్యమిచ్చాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఇప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, నాలుగోసారి పోటీలో ఉండగా, అదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గతంలో బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మున్నూరు కాపు నేత, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది మున్నూరు కాపులే కావడం విశేషం. మంథని నుంచి పుట్ట మధు, రామగుండం నుంచి కోరుకంటి చందర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్‌కు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. ఇక, కాంగ్రెస్ పార్టీ వేములవాడలో ఆది శ్రీనివాస్, కరీంనగర్‌లో పురమల్ల శ్రీనివాస్‌కు టికెట్లు కేటాయించింది. బీజేపీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కు కరీంనగర్‌లో, కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌కు, హుస్నాబాద్‌లో బొమ్మా శ్రీరామ్ చక్రవర్తికి టికెట్ ఇచ్చింది.