ఉమ్మడి జిల్లాలో రెండోరోజూ జోరుగా చెక్కుల పంపిణీ
పెట్టుబడి సాయం కోసం ఉపయోగించుకోవాలి
రైతుల కష్టాలు తెలిసిన నేత సిఎం కెసిఆర్ అన్న జోగు
ఆదిలాబాద్,మే11(జనం సాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండోరోజూ చెక్కుల పంపిణీ జోరుగా సాగింది. మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులకు పేరుపేరునా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పేద ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మనమే ముందున్నామని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల అభివృద్ధి పైనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారన్నారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చర్యలు తీసుకుందని తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం అందించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులు ఆనందంగా ఉన్నపుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని ప్రభుత్వం భావిస్తోందన్నారు. టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేసే బీజేపీ నేడు కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం మన రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను కాపీ కొట్టి అక్కడ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధిలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన చూసి ప్రజలు వచ్చే 20ఏళ్ల పాటు టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. చెక్కలు తీసుకున్న రైతులకు ఈ డబ్బులను ముందుగానే బ్యాంకులో జమ చేసిందని చెప్పారు. గతంలో రైతుల గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలను తెలుసుకొని రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతాంగానికి సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు. ఈ పెట్టుబడి ద్వారా ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతులకు రెండు కిస్తుల్లో మే నెలలో 4వేలు, నవంబర్ మాసంలో మరో రూ.4వేలు మొత్తం ఎకరానికి రూ.8వేలను పెట్టుబడి కింద చెల్లిస్తామని
మంత్రి అన్నారు. రైతులు మధ్య దళారులను ఆశ్రయించకుండా ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు. ఈ పథకం రైతులకు ఎంతో దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఆత్మ విశ్వాసంతో జీవించాలన్నారు. ప్రతి 5వేల ఎకరాలకు క్లస్టరుగా ఏర్పాటు చేసి క్లస్టరుకు ఒకరు చొప్పున ఏఈవో పోస్టులను మంజూరు చేశామన్నారు. అలాగే ప్రతి క్లస్టర్‌కు రైతు భవనాలను నిర్మించి అందులో ఎరువులు విత్తనాలతో పాటు భూ సార పరీక్షలు చేయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రైతులకు మంచి రోజులు పచ్చాయన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు 24గంటల విద్యుత్, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వరంగ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు. నీటి తీరువ పన్నులను ముఖ్యమంత్రి కేసీఆర్ మాఫీ చేశారన్నారు. రైతులకు సబ్సిడీలపై యంత్రాలతో పాటు వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్నామన్నారు. రైతు బాగు పడితేనే దేశం బాగు పడుతుందని తద్వారా బంగారు తెలంగాణ సాధ్య పడుతుందన్నారు.