ఉరి తీయాల్సింది నిందితులనా? మద్యాన్నా?

దేశ రాజధాని ఢిల్లీలో మెడికోపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కొందరు, ఉరితీయాలని మరికొందరు ఇటీవల డిమాండ్‌ చేస్తున్నారు. మూడు రోజులుగా ఇండియాగేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థిలోకం కూడా ఇదే డిమాండ్‌తో కదం తొక్కుతోంది. వారి ఆందోళనకు మద్దతు పలికిన వివిధ వర్గాల వారు కూడా విద్యార్థుల మాదిరిగానే మాట్లాడటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. సంఘటన తీవ్రత, విద్యార్థుల ఆందోళన ఉధృతిలోనే వారు కూడా కొట్టుకుపోతున్నారేమోననిపిస్తోంది. విజ్ఞులైన వ్యక్తులు కూడా సంఘటనను సంఘటనలాగే చూస్తున్నారు తప్ప విచక్షణతో ఆలోచించడం లేదు. స్వతంత్ర భారతావనిలో నేరం చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష విధించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉంది. దానిని విస్మరించి శిక్ష ఎవరు విధించినా చట్ట ప్రకారం నేరమే. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా తప్పే అవుతుంది. హై సెక్యూరిటీ జోన్‌లో వైద్య విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడి గట్టడం భద్రతా వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. యావద్భారతమే కాదు ఢిల్లీ పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, త్రివిద దళాధిపతులు నివాసం ఉండే ఢిల్లీలోనే ఇంతటి దారుణం జరిగిందంటే ఇక మారుమూల పల్లెల్లో మగువల మానానికి ఏపాటి రక్షణ ఉందో తేటతెల్లమవుతుంది. రోజూ ఏదో ఓ మూల మహిళలు, యువతులు, బాలికలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి నియంత్రణలో పాలకులు, పోలసులు తీవ్రంగా విఫలమవుతూనే ఉన్నారు. అవమానాలు, ఆరళ్లు తట్టుకోలేక మహిళలు నిత్యం బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. మహిళలపై సాటి మహిళలే హత్యాయత్నం చేసిన సంఘటనలూ ఇటీవల చూశాం. ఇవన్నీ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనలే. చీకటి పడిందంటే పల్లెల్లోన్ని 90 శాతం కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఒక్కోసారి తీవ్రరూపం దాల్చి ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తున్నాయి. ఫలితంగా పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. నగరాల్లో రాత్రి విధులకు వెళ్లే మహిళలపై, గ్రామాల్లో బహిర్భూమికి వెళ్లి వచ్చేవారిపైనా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు కారణం మద్యం. పీకల్దాక మద్యం తాగి వివేకం, విచక్షణ కోల్పోయే పురుష పుంగవులు ఆడది కనబడగానే గాడిదల్లా ప్రవరిస్తున్నారు. వావి వరసలు, మంచిచెడ్డా మరిచి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో మెడికోపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు కూడా సంఘటన జరిగిన సమయంలో తాము మద్యం తాగి ఉన్నామని నేరాంగికార వాగ్మూలంలో వివరించారు. మద్యం మత్తులోనే గొడవ పడి దురాగతం చేశామని చెప్పారు. వారు చేసింది నూటికి రెండు వందల పాళ్లు దారుణం. మరెవరూ అలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాల్సిన బాధ్యత సభ్య సమాజంలో అందరిపై ఉంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దురాగతాల్లో 90 శాతానికి పైగా మద్యం మత్తులో జరుగుతున్నవేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రజల జీవితాన్ని మద్యం ఎంతగా ఛిన్నాభిన్నం చేస్తుందో ఊహించవచ్చు. దారుణాలకు పాల్పడేవారిని మూమ్మాటికీ శిక్షించాల్సిందే.. మరి ఇలాంటి దారుణాలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తున్న  మద్యాన్ని ఏం చేయాలి. ఉరితీయాల్సింది నేరస్తులనా? మద్యాన్నా? ఈ విషయంపై ప్రతి ఒక్కరు చర్చించాలి. దేశంలోని యువతను నిర్వీర్య పరుస్తున్న మద్యం, మాధక ద్రవ్యాలను సమూలంగా పెకిలించి వేయాలి. స్వేచ్ఛ ముసుగులో యువత పట్టపగ్గాలేకుండా ప్రవర్తిస్తోంది. పబ్‌లు, హబ్‌ల కల్చర్‌ మెట్రో నగరాలను దాటి చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. జూదం, వ్యభిచారం పెట్రేగి పోతున్నాయి. ఇలాంటి సాంస్కృతిక వికాసం మనలను ఎటు తీసుకెళ్తోంది. భిన్న మతాలు, జాతులకు నిలయమైన భారత్‌ వేగంగా సాధిస్తున్నా అభివృద్ధి ఇదేనా? ఈ విశ్కృంఖలత్వాన్నేనా మనం కోరుకున్నది. ఇది అభివృద్ధి కోసమే ఇనాళ్లు పరుగెట్టింది. ఖజానా నింపుకోవాలనే తలంపుతో పాలకులే ప్రజలను తాగుబోతులుగా మారిస్తే దాని విపరిణాలు ఇలాగే ఉంటాయి. ఓట్లు నోట్ల రాజకీయంలో సమిధలు ప్రజలే. పాలకులు ఆడుతున్న జూదంలో పావులూ ప్రజలే. ఆదాయ సమపార్జన పేరుతో దేశంపై విచ్చలవిడిగా మద్యం బూతాన్ని వదిలితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇప్పటికైనా యావత్‌ దేశం మద్యాన్ని ఉరితీయాలని నినదించాలి.