ఉలిక్కిపడ్డ ఉమ

3

హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నయీం హతం కావడంతో అతనికి సహకరించిన పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో  గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి స్పందించారు. నయీం వెనుక తన హస్తం ఉందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తమపై కక్షగట్టిందని ఆరోపించారు. తన ఫోన్‌ నుంచి నయీంకు వందల కాల్స్‌ వెళ్లాయని ప్రచారం చేస్తున్నారని, పోలీసులు వెంటనే స్పందించి కాల్‌ డేటా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కుమారుడితో కలసి ఆమె విూడియాముందుకు వచ్చారు. ఈ వ్యవహారంపై జ్యుడిషియల్‌ విచారణ జరపాలని, సిబిఐ విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదన్నారు. ఒకవేళ తాను దోషిని అని తేలితే జైలుకు వెళ్లడానికి సిద్దం అని ప్రకటించారు. అయితే ప్రభుత్వం రాజకీయంగా కక్షసాధింపు లేదా కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తన భర్త మాధవరెడ్డి ఏ నేపథ్యంలో చనిపోయారో అందరికీ తెలుసని, ఆ తర్వాత రాజకీయాల్లోకి తానెలాగ వచ్చానో తెలుసన్నారు.  తానెంతగా ప్రజా సేవ చేశానో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తన భర్త మాధవరెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చెరిపేయడానికే కుట్రపూరితంగా ఆయన పేరును తెరపైకి తెస్తుందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం నయీం కేసులో ఆత్మరక్షణలో పడి ఇతర పార్టీల నేతలను టార్గెట్‌ చేస్తుందని ఆమె ఆరోపించారు. తన ఫోన్‌ నుంచి నిందితుడికి వందల కొద్దీ కాల్స్‌ వెళ్లాయని పత్రికల్లో రాశారని… అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆమె తెలిపారు. తన భర్త ఉన్నప్పటి నుంచి ఇప్పటి దాకా ఒకే ఫోన్‌ నంబర్‌ ఉపయోగిస్తున్నానని… అనుమానాలుంటే చెక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. నిజానికి నయయీంతో సంబంధాలు ఉన్నవారంతా ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో ఉన్నారని అన్నారు. మాధవరెడ్డి ఉన్నప్పటి నుంచి తాను ఒకే సిమ్‌ వాడుతున్నట్లు చెప్పారు. తనకు ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ లేదని ఉమామాధవరెడ్డి స్పష్టం చేశారు. నయీం ఫోన్‌ నుంచి తనకు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్‌ చేశారు. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తమ కుటుంబం పరువు తీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నయీం కేసులో కొందరిని తప్పించేందుకే తమలాంటి వారిపై బురద జల్లుతున్నారన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నక్సలైట్లపై కక్ష తీర్చుకునేందుకు నయీంను వాడుకున్నట్లు విూడియాకు లీకులిచ్చారని, ఓ ఎమ్మెల్యేను చంపించి ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. హత్యా రాజకీయాలు చేసే నీచ సంస్కృతి తమకు లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా హత్యారాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. నక్సలైట్ల మూలంగానే మా కుటుంబం నష్టపోయింది. మళ్లీ నక్సలైట్లు మమ్మల్ని లక్ష్యం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాఫియాను ప్రోత్సహించే వ్యక్తులుగా మేము కనపడుతున్నామా అని ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఎవరిని తప్పించటానికి నాపై అరోపణలు అని సీఎంను ప్రశ్నించారు. నేను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నానా? భూదందాలు చేస్తున్నానా? నాపై ఎందుకు ఆరోపణలు అని ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గంపై కక్ష గట్టి ఇలాంటి తప్పుడు లీకులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం నుంచి పలువురు విూడియా ప్రతినిధులు తనకు ఫోన్‌ చేశారని… అందుకే విూడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనకు నయీంతో సంబంధాలు అంటగట్టి రాజకీయంగా దెబ్బతీయాలనుకోవడం దారుణమన్నారు. తానేదో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిని కావాలనుకుంటున్నట్లు రాశారని, ఇదంతా కుట్ర కాక మరోటి కాదన్నారు. నయీమ్‌ కేసులో బయటికొస్తున్న పేర్లన్నీ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లవేనని మాధవరెడ్డి కుమారుడు సందీప్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలో ఉన్నవాళ్లు ఈమధ్య మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారని గుర్తుచేశారు. అసలు టీడీపీ అధికారంలో ఉన్న 2004 వరకు భూదందాలు, సెటిల్మెంట్లు ఎక్కడా లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అవన్నీ మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. నయీం రాశాడని చెబుతున్న డైరీ బయటపెడితే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయని అన్నారు. టీడీపీకి గానీ, తమ కుటుంబానికి గానీ దీంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉందని, ఇంకా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. నయీం నక్సలైటుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విషయాలన్నింటిపైనా జ్యుడీషియల్‌ విచారణ జరపాలని తెలిపారు. పాశం శ్రీనుకు ఒకప్పుడు టీడీపీ బీ-ఫారం ఇచ్చాము గానీ అతడు ఓడిపోయాడని.. అది పదేళ్ల క్రితం నాటి మాట అని ఆయన అన్నారు. ఇప్పుడు అతడితో తమకు సంబంధం లేదని తెలిపారు. నయీంకు సహకరించినట్లు వినిపిస్తున్న పేర్లలో పలువురు మంత్రులు, మాజీ మంత్రులు ఉండటం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు నయీం అక్రమాలకు అండగా నిలిచారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలోనే ఆ మాజీ మంత్రి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది.  ఇటువంటి ఆరోపణల నడుమ అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి విూడియా సమావేవం  ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎలక్ట్రానిక్‌  విూడియాలో, పత్రికల్లో వస్తున్న కథనాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎవరిని ఉద్దేశించి ఈ కథనాలు ప్రచురిస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె సందేహం వ్యక్తం చేశారు.  నయీమ్‌కు సహకరించారంటూ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని ఉమా మాధవరెడ్డి డిమాండ్‌ చేశారు. మొత్తం కుట్ర వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అన్నారు. ముఖ్యమంత్రే దానికి బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. నీచ రాజకీయాలు చేసే చరిత్ర తమ కుటుంబానిది కాదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని…తాను తప్పుచేస్తే జైలుకెళ్లేందుకు సిద్ధమని ఉమామాధవరెడ్డి అన్నారు.