ఊడ్చిపారేసిన ‘చీపురు’

CC

దిల్లీకా ధడ్‌కన్‌ ఆమ్‌ఆద్మీ

మట్టికరిచిన కాంగ్రెస్‌,భాజపా

కిరణ్‌బేడీ, మాకెన్‌, షర్మిష్టల ఓటమి

67 స్థానాల్లో ఆప్‌ ఘన విజయం, భాజాపాకు 3

న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): హస్తిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రికార్డులు నమోదయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 3 సీట్లతో ప్రతిపక్ష హోదాకూడా దక్కకుండా చతికిలపడింది. ఉన్న 70 సీట్లకు 67 స్థానాల్లో గెలుపొంది ఆమ్‌ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. చివరకు దిల్లీలో సామాన్యుడే విజయం సాధించాడు. సామాన్యుడి దెబ్బకు ఢిల్లీలో మహామహ నాయకులు మట్టికరిచారు. అంచనాలను మించి ఆమ్‌ ఆద్మీకి విజయం కట్టబెట్టారు. కాంగ్రెస్‌కు అడ్రస్‌ గల్లంతు చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చరిత్ర సృష్టించేలా ఆమ్‌ ఆద్మీకి విజయం కట్టబెట్టాయి. సర్వే అంచనాలను మించి ఆమ్‌ ఆద్మీ విజయం సొంతం చేసుకుంది. కేజ్రీవాల్‌ హవా ముందు మోడీ తదితరులు నిలువలేకపోయారు. కమలనాయకుల వ్యూహాలను తుత్తినియలు చేశారు. ప్రధాని మోడీ ప్రచారం, అమిత్‌షా వ్యూహం కూడా ఇక్కడ పనిచేయలేదు. ఢిల్లీ ప్రజలు ఏకపక్షంగా సామాన్యుడి పక్కన నిలబడి తిరుగలేని విజయాన్ని అందించారు.  శనివారం పోలింగ్‌ జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ మంగళవారం కొనసాగింది. ఇందులో ఆమ్‌ ఆద్మీ పార్టీ  చరిత్రాత్మక విజయం నమోదు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్‌, భాజపాలను ఆ పార్టీ మట్టికరిపించింది. ఆమ్‌ ఆద్మీ దెబ్బకు భాజపా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ అసలు ఖాతా తెరవలేదు. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్‌ 67  స్థానాల్లో విజయం సాధించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నికల్లో బిజెపి సిఎం అభ్యర్థి కిరణ్‌ బేడీ, కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి అజయ్‌ మాకెన్‌ సహా రాష్ట్రపతి ప్రణబ్‌ తనయ షర్మిష్ట కూడా పరాజయం పాలయిన ప్రముఖుల్లో ఉన్నారు. న్యూదిల్లీ నియోజకవర్గంలో ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ విజయం సాధించారు. భాజపా అభ్యర్థి నూపుర్‌ శర్మపై కేజీవ్రాల్‌ గెలుపొందారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలనాధులను ఖంగు తినిపించాయి.  సర్వేల్లో కనీసం 25 సీట్లకు పైగా వస్తాయని ఆశించినా.. వాస్తవ ఫలితాల్లో మాత్రం  అందుకు పూర్తి భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో ఎక్కువ రాష్టాల్ల్రో  బీజేపీ పార్టీయే గెలిచింది. ఢిల్లీ ఎన్నికల్లో కూడా అటువంటి ఫలితమే వస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఘంటాపథంగా చెప్పారు. అయితే ఢిల్లీ వాసులు మాత్రం నరేంద్ర మోదీ  స్వచ్చ్‌ భారత్‌ ను చీపురుతో ఊడ్చేశారు. తాము సామాన్యుడి వెంటే ఉంటామంటూ కేజీవ్రాల్‌ కు పట్టం కట్టారు. దాంతో బీజేపీకి కనీసం ప్రతిపక్ష ¬దా కూడా దక్కలేదు. పదిశాతం సీట్లు అంటే 7 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష ¬దా దక్కేది. అయితే బీజేపీ ప్రస్తుతం నాలుగు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ హవా కొనసాగుతోంది. ఆప్‌ 60 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. కాషాయ నినాదం వద్దు.. సామాన్యుడి నినాదమే ముద్దు అని ఢిల్లీ వాసులు ఈవీఎంల్లో ఓట్లు నొక్కి మరీ చెప్పారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మోడీ నుంచి మొదలుకొని కేంద్ర మంత్రులు, ఆయా రాష్టాల్ర బీజేపీ సీఎంలు ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. విస్తృత ప్రచారాలు, లక్షల మందికి లేఖలు, సామాన్యుడిపై విమర్శనాస్త్రాలు ఏం పని చేయలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌లో వచ్చిన అంచనాలను కూడా బీజేపీ చేరుకోలేక పోయింది. బీజేపీ నాలుగు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయా రాష్టాల్ల్రో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించినప్పటికీ ఢిల్లీలో మాత్రం ఓటమి చవిచూసింది. ఘోర పరాజయం పాలైంది. మేకింగ్‌ ఇండియా సూత్రం పని చేయలేదు. బీజేపీ విజయయాత్రకు సామాన్యులు చెక్‌పెట్టారు. బీజేపీ కార్యాలయం మూగబోయింది. పార్టీ నేతలు, కార్యకర్తలు లేక కార్యాలయం బోసిపోయింది. అమ్‌ ఆద్మీ పార్టీ సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లతో ముందంజలో ఉంది. దాదాపు 62 స్థానాల్లో ఆప్‌ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా.. ఆరు స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది.  దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తున్నా ఢిల్లీ వాసులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిచ్చారు. ఎంతో మంది బీజేపీ ప్రముఖులు ప్రచారం చేసినా ఫలితం మాత్రం ఆప్‌ వైపే మొగ్గుచూపింది. గత ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీ అవతరించినా.. ఈసారి మాత్రం ప్రతికూల ఫలితాలను చవిచూసింది.

రాజకీయ విప్లవం మొదలైందన్న కేజ్రీవాల్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ మనదేశంలో రాజకీయ విప్లవం మొదలైందంటూ ట్విట్టర్లో ట్విట్‌ చేశారు. ఢిల్లీలో వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడతామని కేజీవ్రాల్‌ వ్యాఖ్యానించారు. త్వరలో భారత్‌లో  సమూల మార్పులు చూస్తారని ఆయన అన్నారు. ఢిల్లీ పీఠం ఆప్‌కు  దక్కుతుందో లేదోనని తాను ఎప్పుడూ ఉద్వేగానికి లోనుకాలేదన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ పార్టీకే ప్రజలు పట్టం కడతారని తనకు ముందునుంచి పూర్తి విశ్వాసం ఉందని కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు.

కేజీవ్రాల్‌ కు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ కు ఫోన్‌ చేసిన మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందుకున్న అరవింద్‌ కేజీవ్రాల్‌ త్వరలోనే మిమ్ముల్ని కలుస్తానని మోదీతో అన్నారు. ఢిల్లీ అభివృద్దికి ప్రభుత్వ సహరాం ఉంటుందని ప్రధాని హావిూ ఇచ్చారు.

కెజీవ్రాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

కేజీవ్రాల్‌ నాయకత్వానికే దిల్లీ ప్రజలు పట్టం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు సంప్రదాయ రాజకీయాల మార్పునకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజీవ్రాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ దిల్లీ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు నీతివంత పాలన కోరుతున్నారని రుజువైందని ,ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ప్రజల తీర్పును గౌరవిస్తాం: వెంకయ్య

ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర పాలనపై ఇది ప్రజాభిప్రాయం కాదని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వానికి సహకారం అందిస్తామన్నారు.  ఢిల్లీ అభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఆప్‌ నెరవేర్చాలని ఆయన అన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దిలా ఉండగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజీవ్రాల్కు శుభాకాంక్షలు తెలిపారు.