ఊపిరి పోసుకుంటున్న ప్రజాస్వామ్యం…
ప్రజాపాలనలో స్వేచ్ఛా వాయువులు
కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల కబ్జారాజ్యం బద్ధలు
మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు
శభాష్ సీపీ అభిషేక్ మహంతి.. సర్వత్రా ప్రశంసలు
వందలాది మంది బాధితుల ఫిర్యాదులకు పరిష్కారాలు
పట్టుబడ్డవారిలో ఒకరు కేసీఆర్ బంధువు.. మిగతా మాజీ మంత్రి అనుచరులు
హ్యాట్సాఫ్.. అభిషేక్ జీ..!!
కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఓ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి భూ కబ్జాకోరులపై చర్యలకు ఉపక్రమించడం బాధితులకు భరోసాగా మారింది. దీంతో ఇటీవలకాలంలో ఒక్కొక్కరు ఠాణా మెట్లెక్కి తమకు జరిగిన అన్యాయాలను వివరిస్తున్నారు. ఇందులో రాజకీయ నేతలతో పాటు వారికి సహకరించిన అధికారులు, పోలీసుల పేర్లూ వినబడుతున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారుల పాత్ర ఏ మేరకు ఉన్నదో సీపీ ఆరా తీస్తున్నారు. గతంలో నేతల గుప్పిట్లో ఏకపక్షంగా పనిచేసిన పోలీసులు.. ప్రస్తుతం సీపీ ఆదేశాల మేరకు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బాధితుల ఫిర్యాదు స్వీకరిస్తూ కబ్జాదారుల గుండెల్లో దడపుట్టిస్తున్నారు. అల్టిమేట్‌గా దిగజారిన చోటే సీపీ చొరవతో పోలీసు ప్రతిష్ట పెరుగుతోంది.
జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని పోగుచేసుకున్న భూములు తమకు దూరమవుతుంటే సామాన్యులు తల్లడిల్లారు. కండ్లముందే బుల్డోజర్లతో వచ్చి వి‘ధ్వంసం’ సృష్టిస్తుంటే గుండెలు బాదుకున్నారు. అంగ బలం, అర్థ బలం ముందు నిశ్చేష్టులయ్యారు. నేతల అండదండలు, అధికారుల సహకారాల మెండుతో రెచ్చిపోయిన కబ్జాదారులు.. బాధితులను భయపెడుతుంటే కరీంనగర్‌లో అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్న అనుమానాలు వెంటాడాయి. అర్ధరాత్రులు, పట్టపగలు అనే తేడాలేకుండా ప్రజాప్రతినిధులే పెట్రేగిపోతుంటే ‘అధికారం’ వికటాట్టహాసం చేసింది. అమాయకులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. సీన్ కట్ చేస్తే.. మొన్నటిదాకా అరాచకాలకు పాల్పడ్డవారే స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. కబ్జాలు చేసినవారు కలుగుల్లో దాక్కున్న ఎలుకల్లాగా బయటకొస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో ఏండ్ల తరబడి కొనసాగుతున్న వివాదాలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి.
జనంసాక్షి స్పెషల్ కరస్పాండెంట్ (హైదరాబాద్):కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కబ్జాదారులకు సింహస్వప్నంలా మారాడు. ‘అధికారం’ అండతో అమాయకులను ఇబ్బందులు పెట్టినవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అది రాజకీయ నాయకులైనా, ప్రభుత్వ అధికారులైనా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని కటకటాల్లోకి నెట్టిన ఆయన.. మరికొందరిని వేటాడే ప్రక్రియను వేగవంతం చేశారు. కరీంనగర్‌లో నెలరోజుల్లోనే పోలీస్ కమిషనర్ దర్బార్‌కు 600 మందికిపైగా బాధితులు సీపీకి ఫిర్యాదులు చేయడం సంచలనంగా మారింది. అందులో భూ కబ్జాలు, దౌర్జన్యాలు, వేధింపులకు సంబంధించిన కేసులే ఉండటం అక్కడ జరిగిన దారుణాలను ప్రతిబింబిస్తోంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్బలంతో స్థానిక నేతలు, పలువురు అనుచరులు కరీంనగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని భూములను కాజేసేందుకు యత్నించినట్టు గుర్తించిన సీపీ.. తీగలాగితే డొంక కదులుతోంది. బాధితుల ఫిర్యాదులతో ప్రత్యేక టీంను రంగంలోకి దింపగా.. ఆ బృందం ఒక్కో వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అమాయకుల నుంచి ప్లాట్లు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నవారు పరారీలో ఉన్నారు. ఎక్కువగా మాజీ మంత్రికి బినామీలే ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కార్పొరేటర్లు.. మాజీ మంత్రి అనుచరులు!
సీతారంపూర్ కాలనీలో అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్‌లతో వచ్చి నివాసితులను భయభ్రాంతులకు గురిచేసిన కేసులో ఉపాధ్యాయుడు లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ జంగిలి సాగర్‌పై కేసు నమోదైంది. అతనిపై రౌడీ షీట్ కూడా పెట్టారు. తన భూమిని లాక్కునేందుకు యత్నించడంతో పాటు సాగర్ నుంచి ప్రాణహాని ఉందని లింగారెడ్డి వాపోయాడు. ఇదేవిధంగా బాధితుల ఫిర్యాదుతో తోట రాములు కూడా అరెస్ట్ అయ్యారు. మరో ఘటనలో.. కరీంనగర్ శివారు వివేకానందపురి కాలనీకి చెందిన అనుమాండ్ల రవీందర్ 2014లో కార్తికేయనగర్‌లో 144 గజాల స్థలం కొనుగోలు చేశాడు. బేస్‌మెంట్‌తో పాటు బోర్ కూడా వేసుకున్నాడు. ఇటీవల ఇంటి నిర్మాణం చేపడుతుండగా గత నెల 10వ తేదీన అర్ధరాత్రి కొందరు అక్రమంగా చొరబడి నిర్మాణాన్ని కూల్చివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్ విచారణ చేపట్టి, చైతన్యపురి కాలనీకి చెందిన తోట శ్రీపతిరావు, పొన్నాల కనకయ్య, పవన్, సిరిపురం వెంకటరాజుతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న శ్రీపతిరావును పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. శ్రీపతిరావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అయితే, అరెస్టయినవారు, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరు మాజీ సీఎం కేసీఆర్‌కు దగ్గరు బంధువు కాగా.. ఇంకొందరు మంత్రి గంగులకు సన్నిహితులు, అనుచరులుగా ఉండటం గమనార్హం. పోలీసులు, రెవెన్యూ అధికారుల ప్రమేయంపైనా ఆరోపణలు వస్తుండటంతో వారి పాత్రపైనా సీపీ ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
ఎస్సారెస్పీ భూములు తెరపైకి..
గతంలో రాష్ట్రంలో ఎక్కడా జరగనంత కబ్జాల పర్వం ఒక్క కరీంనగర్‌లోనే బహిర్గతమవుతుండటం సంచలనమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ప్రభుత్వ, ప్రైవేటు తేడాలేకుండా భూములను కనుమరుగు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ సమావేశంలో ఓ మహిళా కార్పొరేటర్ ఎస్సారెస్పీ భూములపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకొచ్చింది. పోలీస్ దర్బార్‌కు కూడా దీనిపై అధికంగానే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కరీంనగర్ శివారులో ఎస్సారెస్పీ భూముల కబ్జా బాగోతాలు కొన్నేండ్లుగా సా…గుతూనే ఉండగా, ఈ విషయంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ను పోలీసులు విచారించినట్టు తెలిసింది. ఎన్‌ఓసీల పేరిట కూడా వసూళ్లు చేసినట్టు తెలియడంతో సీపీ బృందం స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా బొమ్మకల్‌లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలు గురికావడం అందరికీ తెలిసిన విషయమే కావడంతో ఎవరెవరి ప్రమేయం ఉందో కూపీ లాగుతున్నారు.
సీపీ దెబ్బకు సీన్ రివర్స్..!
భూ కబ్జాల బాగోతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీపీ దెబ్బకు ఓ ప్రజాప్రతినిధి తన తప్పును తెలుసుకున్నాడు. అరెస్ట్ భయంతోనో, వ్యక్తి పరివర్తనోగానీ గతంలో కబ్జాచేసిన స్థలాలను బాధితులను పిలిపించుకుని తిరిగి వారికి అప్పగించినట్టు సమాచారం. న్యాయం చేస్తానని చెప్పి ఓ స్థలంలో ప్రహరీగోడ నిర్మించిన సదరు నేత.. ఆ తర్వాత ఇంటినెంబర్లు వేసి, షెడ్ కూడా నిర్మించాడు. బాధితులు సీపీని ఆశ్రయించేందుకు యత్నిస్తున్న దరిమిలా బాధితులను పిలిపించుకుని వారి స్థలాలను వారికే అప్పగించినట్టు తెలిసింది. గత నెలరోజుల కాలంలో భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు అప్పగించి విచారణ చేపట్టాలని ఇప్పటికే సీపీ ఆదేశాలు జారీచేశారు. రాజకీయ నేతలున్న కేసుల్లో నేరుగా సీపీ జోక్యం చేసుకుంటున్నారు. వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ దర్యాప్తు చేపట్టే ప్రక్రియను అధికారులకు సూచనలు అందిస్తున్నారు. దీంతో కబ్జాదారులు కిమ్మనడం లేదని స్థానికంగా చర్చ మొదలైంది.