ఊ అంటారా.. ఊహూ అంటారా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 8న జరిగింది. ఫలితం 24 గంటల్లోపే వచ్చింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 48 రాష్ట్రాలు (మెయిన్, నెబ్రాస్కా పద్ధతి వేరు), రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు (ఓటర్లు లేదా ప్రతినిధులు) 19వ తేదీన తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లలో 306 మంది రిపబ్లికన్లు (మెజారిటీకి అవసరమైన కనీస ఓట్లు 270). 232 మంది డెమోక్రాట్లు. రెండు పక్షాల ఎలక్టర్లు ఎవరి అభ్యర్థికి వారు ఓట్లేసుకుంటారు. కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసే జనవరి 20కి రెండు వారాల ముందు అంటే.. జనవరి 6న ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థిని ప్రకటించడం కేవలం లాంఛనం.
రెండు వారాల ముందు
ముందుగా ప్రమాణం చేసినట్టు తమ అభ్యర్థి ట్రంప్‌కు ఓటు వేయబోనని టెక్సాస్ రిపబ్లికన్ ఎలక్టర్ క్రిస్టఫర్ సప్రూన్ ప్రకటించడంతో సంచలనం మొదలైంది. తమ అభ్యర్థులకు ఓటేయబోమని, ట్రంప్‌కు బదులు ఏకాభిప్రాయంతో ఓ రిపబ్లికన్‌ను ఎంపిక చేసుకుని ఆయనకే ఓటేస్తామని పలువురు ఎలక్టర్లు (రెండు పార్టీలవారు) ఈ నెల ఐదు నాటికే ప్రకటించారు. దీంతో 19న జరిగే ఓటింగ్‌పై ఆసక్తి పెరిగింది. ట్రంప్‌కు ఓటేయడానికి ఇష్టపడని మరో టెక్సాస్ ఎలక్టర్ ఆర్ట్ సిస్నరాస్(రి) తన సభ్యత్వానికే రాజీనామా ఇచ్చారు. అలాగే ట్రంప్‌కు ఓటేయనని బహిరంగంగానే చెప్పిన జార్జియా ఎలక్టర్ బావ్‌కీ వూతో బలవంతంగా సభ్యత్వానికి రాజీనామా చేయించారు. ఇలా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని ఎలక్టర్లను ‘ఫెయిత్‌లెస్’ ఓటర్లని (నమ్మకద్రోహులు) పిలవడం అమెరికా సంప్రదాయం. పైన చెప్పినట్లు ఇలాంటి విశ్వాసఘాతుకానికి పాల్పడే అవకాశమున్న ఎలక్టర్లు రెండు పార్టీల్లో కలిపి ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియదు.
ఫలితం మారుతుందా?
అధ్యక్షుడిగా అర్హత లేదని కొందరు, అత్యధిక ప్రజల ఓట్లు తెచ్చుకోలే దని మరికొందరు ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా.. రిపబ్లికన్ ఎలక్ట ర్లలో 38 మంది ఆయనకు ఓటేయకపోతే తప్ప ఆయనే విజేత అవుతారనడంలో సందేహం లేదు. అధ్యక్ష ఎన్నికలను పరోక్ష పద్ధతి నుంచి ప్రత్యక్ష విధానానికి (పాపుల ర్ ఓటు ద్వారా) మార్చాలనే వాదనకు కూడా ఈ వివాదం వల్ల ప్రచారం లభిస్తోంది.