ఎంఐఎం ఎవరి వైపు?

తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎంఐఎం (ఆల్‌ ఇండియా మర్కతుల్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌) పార్టీ వైఖరి చూసి యావత్‌ తెలంగాణ ముస్లింలు నివ్వెరబోయారు. కేవలం హైదరాబాద్‌ పాత నగరానికే పరిమితైన ఎంఐఎం పార్టీ ముస్లిం ప్రజలందరికీ ప్రతినిధిగా చెప్పుకునేందుకు చేయని ప్రయత్నం. ఇప్పటిదాక ఒకే ప్రాంతంలో ఉన్న తమ పట్టును తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ మరి ప్రజల మనోభావాలను ఎందుకు పట్టించుకోదు. ప్రతి పార్టీకి ఒక విధానం అంటూ ఉంటుంది. ఆ పార్టీ చేసే తీర్మానాలకు కట్టుబడి ఉండాలి. అలా పార్టీ తీసుకునే నిర్ణయాలు, చేసే తీర్మానాలు వ్యతిరేకించే అధికారం ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే ఆయా తీర్మానాలు, నిర్ణయాలు నచ్చితేనే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. కానీ ముస్లింలందరి ప్రతినిధిగా చెలామణీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఎంఐఎం తీరు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నియంతృత్వ ధోరణిలో ఉంది. మేమే సుప్రీం, మేం చేసిందే చట్టం, చెప్పిందే శాసనం అనే తీరుకు ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండదు. అసలు తెలంగాణ పల్లెల్లో హిందువులతో కలిసి మెలిసి జీవనం సాగించే ముస్లింలంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని బలీయంగా కోరుకుంటున్నారు. ముస్లిం ఫోరం ఫర్‌ తెలంగాణ, జమాతే ఇస్లామి హింద్‌, మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ తదితర మరెన్నో సంస్థలు తెలంగాణ రాష్ట్రం కావాలని గొంత్తెత్తి చాటుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ రాష్ట్రం విలీనానికి పూర్వం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వివిధ రంగాల్లో ఎదురవుతున్న వివక్షపై వివరిస్తూ నిరుపేద గ్రామీణ ముస్లింలను జాగురూకం చేస్తున్నాయి. కానీ ఇవేవి సర్వ ముస్లిం ప్రజానీకానికి ప్రతినిధిగా చెప్పుకునే ఎంఐఎంకు పట్టవు. ఎందుకంటే ఆ పార్టీ వ్యవస్థాపకులే స్థానికేతరులు. వారికి వారి స్వప్రయోజనాలే ముఖ్యం. యావన్మంది ముస్లిం ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, ఆత్మగౌరవం వారికి పట్టనేపట్టవు. నిజాం పాలనలో ఉన్నప్పుడు, భారత దేశంలో హైదరాబాద్‌ సంస్థాన విలీనం అయిన తర్వాత ఇక్కడ అధికార భాష ఉర్దూ. ఇప్పటి వరకు ఉర్దూపై ఉన్న దుష్ప్రచారం ఏమిటంటే అది ముస్లింల భాష అని. కానీ అది నిజం కాదు. అరబ్బీ మాత్రమే ముస్లింల భాష. ఉర్దూ భాష మూలం సంస్కృతమే. అది భారతీయ భాషల్లో మాత్రమే ఒకటి. కానీ కొందరు పనిగట్టుకొని ఉర్దూపై బురదజల్లారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కాకపూర్వం హిందూముస్లింలతా ఉర్దూ మిలితమైన తెలుగుభాష మాట్లాడేవారు. హైదరాబాద్‌ రాష్ట్ర ప్రభుత్వంలో ముస్లిం ఉద్యోగుల శాతం 26 కాగా ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం రెండు శాతానికి పడిపోయింది. ఇది ఎంఐఎం పార్టీకి పట్టదు. ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో ఉర్దూమిలితమైన తెలుగు భాష వినిపిస్తుంటుంది. అంటే ఆ భాష ఇంకా సజీవంగానే ఉంది. కానీ ఎంఐఎం మాత్రం ఉర్దూను విస్మరించి ఇంగ్లిష్‌ వైపు, సీమాంధ్ర పెత్తందారి ప్రభుత్వాల ప్రయోజనాల రక్షణకు ప్రయత్నిస్తోంది. ఒక మతం వారైనంత మాత్రాన ఆ మతం పేరుతో నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలోనే ఉండాలనే నిబంధనేమి లేదు. మొదట ఈ విషయాన్ని ఎంఐఎం అధినాయకత్వం గుర్తించాల్సి ఉంది. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న టీఎన్‌జీవోస్‌ వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులు కూడా ముస్లిం ఉద్యోగులే. అప్పట్లో నిర్వహించే సర్కారీ ఉద్యోగాల భర్తీలో ఉర్దూ మాధ్యమంలో చదివిన వారికి అవకాశాలు ఎక్కువగా లభించేవి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలపై, ముఖ్యంగా తెలుగు భాషను రుద్దారు. అప్పటి వరకు తెలుగు చదవడం, రాయడం రాని ఎందరో తదనంతర కాలంలో నిరుద్యోగులుగా మారారు. అంటే భాషాప్రయోక్త రాష్ట్రాల పేరుతో సీమాంధ్ర కుట్రదారులైన రాజకీయ నాయకులు అమాయక తెలంగాణ ప్రజల ఉద్యోగాలను కొల్లగొట్టారు. అంతకుపూర్వం ఈ ప్రాంతంలో అతి తక్కువగా తెలుగు మీడియం పాఠశాలలుండేవి. దీంతో ఆ మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా కొద్ది మందికే లభించింది. తెలుగు భాష పేరుతో బలవంతంగా రెండు ప్రాంతాలను ఒక్కటి చేయడంలో ఎంతో కుట్రదాగి ఉంది. మొదట్లో ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటుకు అమాయకంగా తల ఊపిన తెలంగాణ ప్రాంత నాయకులకు ఆ తర్వాతగాని నిజం బోధపడలేదు. కానీ అప్పటికే పుణ్యకాలం గడిపోయింది. హైదరాబాద్‌లో ని మెజార్టీ ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంత వాసులు కొల్లగొట్టారు. అమాయక హిందూముస్లింలు తీవ్రంగా నష్టపోయారు. అప్పటికే తెలుగు పేరుతో హైదరాబాద్‌ రాష్ట్రంలోని యాస, భాష, కట్టుబొట్టుపై సాంస్కృతిక దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు పూర్తం ఉర్దూ అధికార భాషగా ఉన్నప్పుడు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలపై వాదోపవాదాలు కూడా ఉర్దూలోనే జరిగేవి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో రాష్ట్ర హై కోర్టులో ఇంగ్లిష్‌ భాష వినియోగంలోకి వచ్చింది. ఆ భాషపైనా తక్కువ పట్టున్న తెలంగాణ ప్రాంతవాసులకు ఈ రకంగానూ అన్యాయం జరిగింది. ఇవేవి పట్టని ఎంఐఎం పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర పెత్తందారులతో కలిసి చేతులు కలపడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడే కాదు 1969 ఉద్యమ సమయంలోనూ ఆ పార్టీ సైంధవ పాత్రే పోషించింది. అదే వారసత్వాన్ని కొనసాగిస్తోంది. మతం ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ముస్లింలకు ప్రతినిధిగా రాజకీయాలు చేయాలనుకుంటే వారి మనోభావాలను గుర్తించాలి. ప్రతి తెలంగాణ పల్లెలోని ప్రతి ముస్లిం కోరుకున్నట్లుగా తెలంగాణకు జై కొట్టాలి. వారి ఆకాంక్షలకనుగుణంగా పార్టీ తీర్మానాలు చేసి ముందుకు రావాలి. అంతే తప్ప నేల విడిచి సాము చేస్తే నడ్డివిరగడం ఖాయం.