ఎండల తీవ్రత మరి కొన్నాళ్లు

గిరిజన ప్రాంతాల్లో అడవిబిడ్డల ఆందోళన
ఆదిలాబాద్‌,మే26(జ‌నం సాక్షి): ఉత్తర తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్‌ పూర్వపు జిల్లాలోని ప్రాంతాలు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ పూర్వపు జిల్లాల్లో భగభగలు పెరిగాయి. ఉదయం ఆరుగంటలకే చెమటలు కక్కే ఎండలు కాస్తున్నాయి.  గతంలో ఎన్నడు లేనివిధంగా ఉష్ణోగ్రతలు పెరిగాయన్న ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూరు, జైనూరు, సిర్పూరు(యు),కెరమెరి, తిర్యాణి, ఇచ్చోడ, బోథ్‌, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌, నేరడిగొండ, ఆసిఫాబాద్‌ ఎండలతీవ్రతతో  అతలాకుతలమవుతోంది. ఎండల తీవ్రతను తట్టుకోలేక అడవిబిడ్డలు వ్యాధుల బారినపడుతున్నారు. ఎండలనుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో కన్నా పెరిగి పోతున్నాయి. రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఈ జిల్లాల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. పొట్టకూటి కోసం కూలినాలి చేసుకొనే కష్టజీవులపై ఎండలు  తీవప్రభావం చూపుతున్నాయి.  ఉదయం పూటపనిచేసే కార్మికులు, కర్షకులు వెతలు ఎదుర్కొంటున్నారు. గత వారంరోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఎండ పెరిగిపోతోంది.  ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోనైతే గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతంలో ఎన్నడు లేనివిధంగా రోజు రోజుకు వాతావరణంలో భారీ మార్పులతో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆందోళన చెందుతున్నారు.  సాయంత్రం ఐదు గంటలు దాటినా వాతావరణం చల్లబడడం లేదు.  కుగ్రామాల నుంచి మొదలుకొని గూడాలు, తండాలే కాదు మండల, పట్టణ కేంద్రాల్లో సైతం ఎండల తీవ్రతకు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడు నమోదు కాని రీతిలో ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. జ్వరాలతోపాటు ఇతరత్ర వ్యాధులతో సతమతవుతున్నారు.

తాజావార్తలు