ఎంతగా బిజెపిని విమర్శిస్తే అంత రాజకీయ లాభం

బిజెపి,వైకాపా కలిశాయని చెప్పడంతో లబ్దిపొందే యత్నం

ఇదే సూత్రంతో ముందుకు పోతున్న చంద్రబాబు

అమరావతి,జూలై2(జ‌నం సాక్షి): ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీని ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తే ప్రజలు అంతలా ఆదరించే పరిస్థితి ఉందని అధికార టిడిపి భ్రమల్లో ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజలు పట్టించుకోరని, వాటిని కప్పిపుచ్చేలా బిజెపిపై దండయాత్ర చేస్తే సరిపోతుందన్న భావనలో ఈ రకమైన కార్యకలాపాలకే టిడిపి ప్రాధాన్యం ఇస్తోంది. కడప ఉక్కు విషయంలో సిఎం రమేశ్‌ చేపట్టిన దీక్ష ఇలాంటిదే అనదడంలో సందేహం లేదు. అయితే ప్రజల ఆలోచన మరో విధంగా ఉంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంబంధాల విషయంలో పూర్తి భిన్నమైన వైఖరిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్నారు. గడచిన కొన్ని రోజులుగా ఆయన ప్రధాని మోదీని ఘాటుగా విమర్శిస్తున్నారు. బీజేపీతో మిత్రత్వాన్ని కొనసాగిస్తే నష్టపోతానన్న ఉద్దేశంతోనే ఆయన సమయం చూసుకుని బయటపడ్డాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక¬దా విషయంలో వెనక్కి పోయిన అపప్రధ నుంచి బయటపడేందుకు ఎదురుదాడి మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకే ఎన్‌డీఏ నుంచి వైదొలగుతున్న విషయాన్ని బాబు ప్రధాని మోదీకి, బిజెపికి తెలియజేసినప్పుడు వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే బాబు అవకాశవాద రాజకీయాలకు ఆద్యుడని వారు గుర్తించారు. నాటి నుంచి కేంద్రంతో ఏర్పడిన అంతరం పెరుగుతూ వస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎపిలో నెలకొన్న పరిస్థితులను బట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయి రాజకీయాలలో అనుభవంతో పాటు పరిచయాలు ఉన్న చంద్రబాబు కర్ణాటక పరిణామాల నేపథ్యంలో రంగప్రవేశం చేశారు. బీజేపీ వ్యతిరేక ముఖ్యమంత్రులను ఒకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో స్వరాష్ట్రంలో బీజేపీపై దాడిని ముమ్మరం చేశారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని

అంటారు. అందుకే ఎన్‌డిఎ నుంచి బయటకు రావడంతోనే గతంలో ఉన్న పాత మిత్రులతో బాబు మంతనాలు సాగిస్తున్నారు. ఈ సూత్రానికి అనుగుణంగా చంద్రబాబు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీతో ఆయన శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రాలేరన్న నమ్మకంతోనే చంద్రబాబు ఉన్నారు. అందుకే బాబు కొంత దూకుడు పెంచారు. బీజేపీ నాయకులు కూడా అంతే కసిగా వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమికి కంకణం కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరుతూ ఎంపీ రమేశ్‌ ఆమరణ నిరాహారదీక్ష చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమే! ఇక ఇదే కోవలో విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో నిరాహార దీక్ష చేయించే విషయాన్ని తెలుగుదేశం నాయకత్వం పరిశీలిస్తోంది. ఇలాంటి ఆందోళనలను చేపట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలను బిజెపికి వ్యతిరేకంగా సన్నద్దం చేయాలని చూస్తున్నారు. దీక్షలు, ఆందోళనల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టాలని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని బాబు భావిస్తున్నారు. బీజేపీ, వైసీపీ మధ్య బంధం ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రజల్లోకి వెళుతోంది