ఎంత మందిని వెనకేసుకొస్తారు?
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ మేనల్లుడు విజయ్‌సింగ్లా రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి నుంచి రూ.90 లక్షలు లంచగా తీసుకుంటూ సీబీఐకి అడ్డంగా దొరికిపోయాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన చీకటి కోణాల్లో ఈ వ్యవహారం మరో మలుపు. ఇది వరకు వెలుగు చూసిన కుంభకోణాలన్నీ సుప్రీం కోర్టు ఆదేశంతో వెలుగు చూసినవే. మొట్టమొదటిసారిగా ఓ కేంద్ర మంత్రి బంధువు ఆయనకు చెందిన మంత్రివర్గ శాఖ మేల్లు చేకూర్చేందుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసినా సదరు మంత్రికి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ప్రతిపక్షాల నిరసనల హోరును కొనసాగించడంతో ఇక తప్పదన్నట్టు మంత్రి వర్గం నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అంతలోనే మిస్టర్ క్లీన్ ప్రైమినిష్టర్‌గా పేరుతెచ్చుకున్న మన్మోహన్‌సింగ్ ఆయనకు అండగా నిలిచాడు. రాజీమానా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రతిపక్షాలను తప్పుబట్టచూశాడు. ఇదే రైల్వే శాఖకు మంత్రిగా పనిచేసిన లాల్‌బహదూర్ శాస్త్రి ఎక్కడో ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యనేతలెందరో నచ్చజెప్ప జూసినా ఆయన ససేమిరా అన్నారు. తన శాఖలో.. తన సిబ్బంది వల్ల జరిగిన నష్టానికి తానే బాధ్యుడినని చెప్పుకున్నారు. అప్పట్లో రాజకీయాల్లో విలువలు అంతగా గొప్పగా ఉండేవి. ఢిల్లీలో ఉండే రైల్వే మంత్రి ఎక్కడో జరిగిన ప్రమాదానికి నైతిక బాధ్యత వహించేవారు. ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. రైల్వే శాఖ మంత్రికి స్వయానా మేనల్లుడే ఓ ఉన్నతాధికారిని అంతకంటే కీలకమైన పదవిలో కూర్చోబెట్టేందుకు రూ.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఈమేరకు ఆయన రూ.90 లక్షలు అడ్వాన్స్ రూపేణ చెల్లిస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసు తుదకంటా నిలబడుతుందా? విజయ్‌సింగ్లా, బన్సల్ దోషులుగా తేలుతారా అనేది తర్వాతికాలంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. విచారణలో జరిగే పరిణామాలు, ఎదురవబోయే అడ్డంకులను పక్కన బెడితే జరిగిన డీల్.. దానికి ముందస్తుగా తీసుకున్న అడ్వాన్స్ ఒక్కటే చెప్తున్నాయి. కేంద్రంలో అవినీతి పేట్రేగిపోయింది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన అగస్టా హెలీక్యాప్టర్ల కుంభకోణం, దానికి అటుఇటుగా జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో చేతివాటం, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ కుంభకోణం, దేశంలోనే కనీవినీ ఎరుగుని స్థాయిలో చోటు చేసుకున్న బొగ్గు బ్లాకుల కేటాయింపు వ్యవహారం ఇవన్నీ అవినీతికి ఆమడదూరంలో ఉండే మన్మోహన్ ప్రభను మసకబర్చాయి. ఆయనకు తెలియకుండా వీటిలో ఏ ఒక్క కుంభకోణమూ జరిగే అవకాశం లేదు. ఇటీవల యూపీఏతో విభేదించి బయటకు వచ్చిన డీఎంకే 2జీ స్పెక్ట్రం కేసులో ఎదురుదాడిని ప్రారంభించింది. అన్నీ ప్రధానికి చెప్పే చేశానని టెలికమ్యూనికేషన్ల శాఖ మాజీ మంత్రి రాజా ఇటీవల బాంబు పేల్చారు. బొగ్గు కుంభకోణంలో అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో పాటు, సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక ముందుగానే బయల్పడ్డాయి. ఇవన్నీ కేంద్ర సర్కారు కనుసన్నల్లోనే జరిగాయనే ఆరోపణలు ప్రతినిత్యం వినవస్తున్నాయి. అవి నిజమని తేలింది కూడా. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రధాని మన్మోహన్ ఒక్కరే మడికట్టుకొని కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం పవిత్రమైనది అయిపోదు. అవినీతి పాల్పడినట్టుగా భావిస్తేనే విచారణ పూర్తయ్యే వరకూ అధికారానికి దూరంగా ఉండమని చెప్పే సంప్రదాయం ఇప్పుడు రివర్స్ అయింది. రెడ్ హ్యాండెడ్‌గా కేంద్ర మంత్రి బంధువు డబ్బు తీసుకుంటే అంతకంటే నిదర్శనాలేం కావాలి. అయినా ఆ మంత్రిని కూడా ప్రధాని వెనకేసుకొచ్చారు. తనకు తన మేనల్లుడికి ఏం సంబంధం లేదని బన్సల్ ప్రకటించినా అది నిజం కాదు. అసలు బన్సల్‌తో ఏ సంబంధాలు లేకుంటే విజయ్ సింగ్లా డబ్బులు ఎందుకు తీసుకుంటాడు ఎందుకు ఉన్నతస్థాయి పదవిని ఎందుకు ఇప్పిస్థానని మాట ఇస్తాడు. అందుకోసం రూ.12 కోట్ల భారీ మొత్తంతో ఎందు డీల్ కుదుర్చుకుంటాడు. కేంద్రంలో మంచి పోర్ట్‌పోలియో ఉన్న మంత్రులకు బంధువులైనా చాలు పెద్ద పెద్ద పైరవీలు చేసుకొని జీవితంలో స్థిరపడవచ్చు అనే ఆరోపణను నిజం చేశాడు విజయ్ సింగ్లా. రాగద్వేషాలకు అతీతంగా మంత్రి పదవిని వెలగబెడతానని చెప్పిన మంత్రి బంధుగణానికి అనుచిత లబ్ధి చేకూర్చేందుకు పైరవీలను ఎరగా వేశాడని ఈ ఎపిసోడ్ తేల్చిచెబుతుంది. అలాంటి వ్యక్తి ప్రతి పక్షాల ఒత్తిళ్లతో పదవినుంచి తప్పుకుంటానంటే ప్రధాని వద్దని వారించాడు. ఈయన ఒక్కరినే కాదు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏమంత్రినైనా ప్రధాని ఇలాగే వెనకేసుకొస్తున్నారు. తద్వారా వారి అవినీతి భాగస్వామి అవుతున్నాడు. యూపీఏ సర్కారు అవినీతి, కుంభకోణాల చరిత్రలో మరో కలికి తురాయి చేరింది. ప్రధాని అందులో భాగస్వామి కావడమే విచారకరమైన అంశం. రాజకీయాల్లో వ్యక్తిగతంగా నీతిమంతులుగా ఉంటే చాలదు. తన సహచరులూ తనలాగే ఉండేలా చూసుకోవాలి.