ఎందుకంత అలసత్వం?

2

– కొలీజియం నియామకాలపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి):న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై కొలీజియం నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్రం విఫలమవ్వడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే 75 మంది హైకోర్టు జడ్జిల నియామకాలు,బదిలీలకు సంబంధించి అంగీకారం తెలిపినప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఆమోదించడంలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ ఫైల్స్‌ అన్నీ ఎక్కడ నిలిచిపోతున్నాయో అర్థంకావట్లేదంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ మండిపడ్డారు.కొలీజియం బదిలీ చేసిన జడ్జిల బదిలీలు ఇంకా జరగలేదని.. ఇంత అపనమ్మకం ఎందుకు.. ఇదంతా తాము కోరుకోవట్లేదని అన్నారు. కొలీజియం ప్రతిపాదించిన జడ్జిల నియామకం పట్ల సమస్య ఏదైనా ఉంటే తెలియజేయండి.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. జడ్జిల నియామకం ఆలస్యం కావడంతో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల  హైకోర్టులలో దాదాపు 400 మంది జడ్జిల నియామకాలు, బదిలీలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.