ఎంపీలూ.. ఇదే ఊపు కొనసాగించండి

తెలంగాణ సమస్యపై యూపీఏ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేలా ఒత్తిడి తెచ్చి టీ కాంగ్రెస్‌ ఎంపీలు పెద్ద విజయమే సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఆకాంక్షను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. పార్లమెంట్‌ నిండు సభలో అధినేత్రి ఎదురుగానే ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకున్నా, సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేసినా, చీవాట్లు పెట్టిన వారు పట్టించుకోలేదు. ప్రజల అభిప్రాయాన్ని పాలకులకు తెలపడమే తమ అభిమతన్నట్లుగా వ్యవహరించారు. ఒక దశలో పార్టీని వీడేందుకు కూడా సిద్ధపడ్డారు. తాము ఏం చేసినా ప్రజల ఆకాంక్షల మేరకే నడుచుకున్నాం తప్ప సొంత ఎజెండా లేదని చెప్పుకొచ్చారు. టీ జేఏసీ నేతృత్వంలో నిర్వహించిన అన్ని ఉద్యమాలు, ఆందోళనల్లో పాలు పంచుకున్నారు. రైల్‌ రోకోలో పాల్గొంటామని ముందే ప్రకటించి ఎవరు ఎక్కడ ఆందోళన చేపట్టాలనే షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ ప్రాంత మంత్రులు వారిని కనీసం పిలిచి మాట్లాడకుండా అరెస్టు చేయించి జైలుకు తరలించారు. సొంతపార్టీ ఎంపీలు ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటే ఈ ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రి నిర్ణయానికి వంత పాడటంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. జైలులో ఉన్న ఎంపీలను పరామర్శించడం కనీస ధర్మమని కూడా ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించలేదు. వారు ఏదో నేరం చేసి జైలుకు వెల్లినట్టు ముఖం చాటేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో దిగివచ్చి వివరణలు ఇచ్చుకోవడం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటే కలిగే ప్రయోజనాలు తప్ప అప్పుడు వారికి ఏమి పట్టేవికావు. మంత్రి పదవుల కోసమో, కాంట్రాక్టుల కోసం కన్నభూమికి ఎంత నష్టం కలిగిస్తున్నామో కూడా అర్థం చేసుకోలేకపోయారు. సకల జనుల సమ్మె సమయంలో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బలిదానాలు చేసుకున్నపుడు, పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించినపుడు వర్సిటీకి వెళ్లి సంఘీభావం తెలిపిన మంత్రులు తర్వాత పంథా మార్చారు. విద్యార్థుల మృతదేహాల మీద ప్రమాణాలు చేసిన వారు తర్వాత వాటిని విస్మరించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రుల అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. టీ జేఏసీ, ఎంపీలు చిత్తశుద్ధితో ఉద్యమాలు నిర్వహిస్తుంటే అనేక ఆరోపణలు గుప్పించారు. స్వపక్షంలోనే విపక్షంలా మారి సూదుల్లాంటి మాటలతో పొడిచారు. పార్టీని వీడేందుకే అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్టు నటిస్తున్నారని నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. కానీ నవ్విన నాప చేనే పండింది. నవ్విన వారికే నగుబాటు ఎదురైంది. టీ ఎంపీల ఆందోళనకు ఫలితం దక్కింది. కీలెరిగి వాత పెట్టినట్లుగా ప్రభుత్వం ఆప్కతాలంలో ఉండగా ఎంపీలు మొండిపట్టు పట్టడంతో అధిష్టానం దిగిరాక తప్పలేదు. స్వయంగా పార్టీ అధినేత్రి రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దే చర్యలు మొదలు పెట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని దూతలుగా పంపి ఎంపీల డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాతే ఎంపీలు పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి సర్కారుకు అండగా నిలిచారు. ఎంపీలు కనుక పట్టుబట్టి ఉండకపోతే తెలంగాణ అంశాన్ని కోల్ట్‌ స్టోరేజీ నుంచి తీసేవారు. ఎన్నికలు, ఓట్లు, సీట్ల పంచాయితీ ఇప్పుడు ఎలాగు లేదు.. ఎందుకు తేనెతుట్టెను కదపడం అనే భావన కాంగ్రెస్‌ పెద్దల్లో ఉండేది. ఎంపీల మంకుపట్టుతోనే తెలంగాణ అంశం కోల్డ్‌స్టోరేజీ వీడి వెలుపలికి వచ్చింది. డిసెంబర్‌ ఐదో తేదీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిజంగా గుర్తిండిపోయే రోజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిల ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 28న నిర్వహించే అఖిల పక్షానికి రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీల నుంచి ఒక్కో ప్రతినిధిని ఆహ్వానిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఎంపీలకు హామీ ఇచ్చారు. ఇప్పుడే అసలు కథ మొదలైంది. 2009 డిసెంబర్‌ 7న జరిగిన అసెంబ్లీ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై బిల్లు పెడితే మద్దతు ఇస్తామని ప్రకటించారు. అప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారపార్టీ తీర్మానం పెట్టకుంటే తామే ప్రైవేటు తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని నిండు సభలో చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చేసిన తీర్మానాల మేరకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్‌ 9న అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. తెల్లవారగానే చంద్రబాబు స్టాండ్‌ మార్చుకున్నారు. తెలంగాణపై అడ్డం తిరిగారు. అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటారా అంటూ సీమాంధ్ర ప్రాంత నేతలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. కొందరిని ముందు పెట్టి రాజీనామాలు చేయించారు. ఈ విషయాన్ని ఇటీవల ఆ పార్టీ వీడిన ఎమ్మెల్యేలే ప్రకటించారు. అదే చంద్రబాబు ఇప్పుడు అఖిలపక్షం కావాలన్నారు. ఆయనకు ఒక్కటే విశ్వాసం కాంగ్రెస్‌ అఖిల పక్షం ఏర్పాటు చేయదు, తాను నిర్ణయం చెప్పను అని. కానీ ఎంపీలు పట్టుదలతో సీన్‌ రివర్స్‌ అయింది. ఢిల్లీ దిగివచ్చింది. ఇప్పుడు పరీక్షా కాలం ఎదుర్కోబోతుంది కేవలం తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలే. ఒకవేళ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ కనీసం ఈ ప్రాంతంలోనైనా బలపడుతుంది. మరి ఆ రెండు పార్టీలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఎంపీల దెబ్బకు వారికి పట్టపగలే చుక్కలు కనిపించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. టీ టీడీపీ నేతల ప్రకటనలు ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.