ఎంపీ ఇంటిముందు చెవిలో పువ్వుతో కెబివిటి నిరసన

నిజామాబాద్‌, జనవరి 28 (): తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్‌ ఇంటి ముందర ఎబివిపి నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఎంపీ తెలంగాణ కోసం హైదరాబాద్‌, ఢిల్లీలలో పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆరోపిస్తూ చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు తమ పద్దతి వీడి పదవులకు రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమించాలని కెబివిటి నగర అధ్యక్షుడు నవీన్‌ డిమాండ్‌ చేశారు. గత 50 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలను మభ్యపెడుతూ వస్తున్న కాంగ్రెస్‌ మరోసారి మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు అంజనాగౌడ్‌, రాకేష్‌, కృష్ణ, వాసు, భాను  తదితర విద్యార్థినాయకులు పాల్గొన్నారు.