ఎంసెట్‌ పరీక్షలు సర్కారీ విద్యాలయాల్లోనే

1

– ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌,మే7(జనంసాక్షి): ఇంజినీరింగ్‌, వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 15న నిర్వహించబోయే ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేమని,  ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. ఈనెల 9 నుంచి హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ పరీక్ష ఉంటుందని తెలిపారు.  మొత్తం 2 లక్షల 46 వేల 522 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో ఇంజినీరింగ్‌ విభాగానికి 1 లక్షా 44వేల 510 దరఖాస్తులు, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి లక్షా 2 వేల 12 దరఖాస్తులు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌ను ఎనిమిది జోన్లుగా విభజించి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇంజినీరింగ్‌ కోసం 276,మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కోసం 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌కు అధికారులు పరీక్షా కేంద్రాలను ఖరారు చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్షలు నిర్వహిస్తుండటంతో ముందుగా నిర్ణయించిన వాటి కంటే కేంద్రాలు పెరిగాయి. వసతులున్న కేంద్రాలు దొరుకుతాయో, లేదోనని మొదట ఆందోళనకు గురైనా సమస్యను కొలిక్కివచ్చినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 242, మెడికల్‌కు 142 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు తెలంగాణ, ఏపీ రాష్టాల్లో 1.43లక్షల మంది, మెడికల్‌కు 1,09,983 మంది హాజరుకానున్నారు. తెలంగాణలో ఇంజినీరింగ్‌కు సుమారు 1.23లక్షల మంది, మెడికల్‌కు సుమారు 70వేల మంది రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు సహకరించేదిలేదని ప్రైవేట్‌ విద్యాసంస్థలు తీర్మానించడం… ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరుపుతామని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కొత్తగా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ప్రైవేట్‌ విద్యాసంస్థలను ఇందుకు దూరం చేశారు.  హెచ్‌సీయూ, ఉర్దూ విశ్వవిద్యాలయం, పోలీసు అకాడవిూ తదితరాల్లోనూ తొలిసారిగా ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో బల్లల కొరత ఉండటంతో అద్దెకు తెచ్చి ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. మెడికల్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు 550 మంది హాజరవుతుండగా హైదరాబాద్‌లో 500 మంది, వరంగల్‌లో 50 మంది రాయనున్నారు. హైదరాబాద్‌లో జేఎన్‌టీయూహెచ్‌లో ఆన్‌లైన్‌ పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటుచేశారు.