ఎంసెట్-2012 ఫలితాలు విడుదల టాప్-10లో బాలురదే పైచేయి
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జూన్ 29 : ఎంసెట్-2012 ఫలితాలు విడుదలయ్యాయి. టాప్ 10లో బాలురదే పైచేయిగా నిలిచింది. మాసాబ్‌టాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎంసెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 73.18శాతం మంది, మెడికల్‌లో 85.57శాతం మంది అర్హత సాధించారని ఉప ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంజనీరింగ్‌లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇంజనీరింగ్, మెడికల్‌లో బాలురు తమ ప్రతిభను కనబర్చారన్నారు. ఇంజనీరింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన చింతా నితీష్ చంద్ర 159 మార్కులకు గాను 149 మార్కులు కైవసం చేసుకుని ప్రథమ ర్యాంకు సాధించారన్నారు. రెెండో ర్యాంకును విశాఖకు చెందిన మనోజ్‌కుమార్, మూడో ర్యాంకును విజయవాడకు చెందిన రూపేష్, నాల్గో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన ధీరజ్‌రెడ్డి, ఐదో ర్యాంకును విజయవాడకు చెందిన సాయికుమార్, ఆరో ర్యాంకును విజయవాడకు చెందిన మకరన్, ఏడో ర్యాంకు ప్రభాకర్, ఎనిమిదో ర్యాంకు ఆకుల శ్రీనివాస్, తొమ్మిదో ర్యాంకును అనీలా యాదవ్, పదో ర్యాంకును విశాఖకు చెందిన సుష్మ కైవసం చేసుకున్నారు. అలాగే మెడిసిన్‌లో తొలి ర్యాంకు హైదరాబాద్‌కు చెందిన విజయకేతన్, రెండో ర్యాంకు సుంకర వీరేంద్ర (ప్రకాశం), మూడో ర్యాంకు బివిఆర్‌ఎస్ సాయి, నాల్గో ర్యాంకు నరేష్‌బాబు (వరంగల్), అయిదో ర్యాంకు దాసరి ఉత్తేజ్, ఆరో ర్యాంకు బొబ్బిలి సవ్యసాచి, ఏడో ర్యాంకు నితిన్‌చంద్ర, ఎనిమిదో ర్యాంకును భరద్వాజ (నెల్లూరు), తొమ్మిదో ర్యాంకును అక్షయ్ (హైదరాబాద్), పదో ర్యాంకును గడ్డం వినూత్న (రంగారెడ్డి) కైవసం చేసుకున్నారు. శుక్రవారం నాటికి ఇంజనీరింగ్‌లో 667 కళాశాలలు ఉన్నాయని, వాటిల్లో 3,21,000 సీట్లు ఉన్నాయన్నారు. అలాగే ఫార్మసీ కళాశాలలు 21 ఉండగా వాటిల్లో 29,846 సీట్లు ఉన్నాయన్నారు. ఎంబిబిఎస్ కళాశాలలు 37 ఉండగా వాటిల్లో 4,956 సీట్లు ఉన్నాయని వివరించారు. ఇంజనీరింగ్ తొలి కౌన్సెలింగ్ జులై మూడో వారం నుంచి ప్రారంభమవుతుందని, రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి కొనసాగుతుందన్నారు. మెడిసిన్ కౌన్సెలింగ్ జులై 20న ప్రారంభమై 27వ తేదీతో ముగుస్తుందన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలల్లో తరగతులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతాయని వివరించారు. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,83,685మంది హాజరు కాగా మెడికల్, అగ్రికల్చరల్ పరీక్షకు 90,919మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.