ఎగ్జిట్ పోల్ ఫలితాలపై సర్వత్రా చర్చ
టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
ఖమ్మం, మే 20 (జనంసాక్షి) : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల అనుచరగణంలో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండగా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ వ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఫలితాలునిజమవుతాయా అన్న రీతిలో ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి పోటీ పడగా, టిఆర్‌ఎస్ నుంచినామా నాగేశ్వరరావు పోటీ పడ్డారు. ఇప్పుడు ఎవర్ని విజయం వరించనుందో తెలియని పరిస్థితి నెలకొంది. 23న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాతనే అభ్యర్థుల విజయం తెలియాల్సి ఉంది. అయితే ఆదివారం సాయంత్రం వివిధ సంస్థలు దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ఫోల్స్‌ను ప్రకటించారు. ఎగ్జిట్‌పోల్స్ సర్వే ప్రకటించిన తర్వాత అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మద్య అప్పుడే టెన్షన్ మొదలైంది. ప్రధానంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకాచౌదరి మద్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పూర్తిస్థాయిలో ఈ రెండు నియోజకవర్గాల్లో మద్దతు ప్రకటించి ప్రచారాన్ని బాధ్యతా యుతంగా చేశారు. మిగిలిన పార్టీలు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెలేల్యను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. మహబూబాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోకవర్గాలున్నాయి. ఈ మూడు నియోకవర్గాల్లో కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మద్య పోటీచేసిన అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలతో టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.