ఎట్టకేలకు ఖాళీచేశారు!

– అధికార నివాసాలు ఖాళీ చేసిన ములాయం, అఖిలేష్‌
లక్నో, జూన్‌2(జ‌నం సాక్షి) : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆయన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ శనివారం లక్నోలోని తమ అధికార నివాసాలను ఖాళీ చేశారు. మాజీ ముఖ్యమంత్రులను అధికార నివాసాలు ఖాళీ చేయమనడాన్ని తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టులో అంతకుముందు సవాలు చేశారు. రెండేళ్లు సమయం ఇవ్వాలని కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తన వయస్సు, ఆరోగ్య కారణాలను సైతం ములాయం ప్రస్తావించారు. అఖిలేష్‌ అయితే తన భద్రత, పిల్లల చదువు వంటి కారణాలను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రులు అధికార నివాసాల్లో జీవితాంతం ఉండేలా చట్టంలో మార్పులు చేయాలన్న వీరి అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రాజ్యాంగ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి ఆదేశాలు తామివ్వలేమని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఈనెల ప్రారంభంలో మాయావతి,
అఖిలేష్‌ యాదవ్‌, మరో నలుగురు మాజీ ముఖ్యమంత్రులను తమ అధికార నివాసాలు విడిచిపెట్టాలని నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 15 రోజుల్లోగా వాటిని ఖాళీ చేయాలని పేర్కొంది. అఖిలేష్‌ సైతం రెండ్రోజుల క్రితం ‘నాకో జాగా చూపించండి’ అని విూడియాతో మాట్లాడుతూ అన్నారు. కాగా, తండ్రీకొడుకులిద్దరూ అధికార నివాసాలు ఖాళీ చేసి ఎక్కడకు వెళ్తున్నారన్నది ఇంకా స్పష్టం కానప్పటికీ కొద్దిరోజుల పాటు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండి…ఆ తర్వాత లక్నోలోని ఓ ప్రైవేట్‌ కాలనీలోని మూడు విల్లాల్లోకి మారుతారని తెలుస్తోంది.