ఎడ్లబండిలో అసెంబ్లీకొస్తాం.. అనుమతివ్వండి

– చమురు ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్‌ నేతల అభ్యర్థన
లఖ్‌నవూ, మే26(జ‌నంసాక్షి) : గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం 11రోజుల్లోనే ధరలు రూ.3కు పైగా పెరిగాయి. దీంతో వినియోగదారులపై ఇంధన భారం మరింత ఎక్కువైంది. ఈ విషయమై కేందప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షాలు.. ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలకు నిరసనగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత వినూత్న అభ్యర్థన చేశారు. అసెంబ్లీకి ఎద్దులబండిపై వస్తాను.. అనుమతివ్వండి అని కోరారు.
పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలమవుతోంది. అందుకే ఇకపై నేను అసెంబ్లీకి ఎద్దులబండిపై వస్తాను. ఆ బండికి ప్రవేశ పాస్‌ ఇప్పించండి’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దీపక్‌ సింగ్‌ విధాన పరిషత్‌ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు స్థిరంగా ఉన్న చమురు ధరలు ఆ తర్వాత మాత్రం రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. దీంతో కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఈ విషయంపై ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు. ‘భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించినట్లుగానే.. నా సవాల్‌ను కూడా స్వీకరించండి. చమురు ధరలు తగ్గించండి. లేదంటే దేశ వ్యాప్త నిరసనలు జరుగుతాయి అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.